GST revenue: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు వరుసగా ఏడో నెలలో రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సరికొత్తగా ఆల్ టైమ్ రికార్డుస్థాయితో రూ.1.41 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చి నెలలో నమోదైన రూ.1.23 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇది స్పష్టమైన సంకేతమని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా 2020 ఏప్రిల్ నెలలో జీఎస్టీ ఆదాయం రూ.32,172 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత నెలల్లో వసూళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చి, 2020 అక్టోబర్ నెలలో మళ్లీ రూ.లక్ష కోట్లకు చేరాయి. అప్పటి నుండి ప్రతినెలా వసూళ్లు ఈ మైలురాయికి ఎగువన నమోదు కావడంతో పాటు ప్రతి నెల అంతకంతకూ పెరుగుతున్నాయి.

గత నెలలో మొత్తంగా రూ.1,41, 384 కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా, ఇందులో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.27,837 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.35,621 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.68,481 కోట్లు, సెస్ రూపంలో రూ.9445 కోట్ల మేర వసూలయినట్లు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో గత నెల దేశవ్యాప్తంగా పలుచోట్ల లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమల్లోకి వచ్చి వ్యాపారాలపై ప్రభావం చూపిస్తున్నప్పటికీ కలెక్షన్స్ భారీగా వసూలయ్యాయి.


Click it and Unblock the Notifications