కేంద్ర ప్రభుత్వానికి GST (వస్తువులు, సేవల పన్ను) రేటు కోతల వల్ల భారీ ఆదాయ నష్టం కలగబోతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.అయితే బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం ఈ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. FY24 ప్రాతిపదికన చూసుకున్నట్లయితే జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల స్థూల ఆదాయ నష్టం రూ. 93 వేల కోట్లకు చేరుకున్నట్లు SBI అంచనా వేసింది. అయితే అదనపు పన్ను వసూళ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికర నష్టం రూ. 48వేల కోట్లకు తగ్గింది.
FY26కి వచ్చేసరికి.. స్థూల ఆదాయ నష్టం రూ. 1.11 లక్షల కోట్లుగా ఉండొచ్చని ఈ నివేదిక చెబుతోంది.అయితే బలమైన వినియోగ ధోరణులు, అధిక పన్ను వసూళ్ల కారణంగా, కేంద్రం, రాష్ట్రాల వాటా కలిపి నికర నష్టం కేవలం రూ. 25,794 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఆరు నెలల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి జరిగే నష్టం గణనీయంగా తక్కువగా ఉంటుందని SBI అంచనా వేసింది. FY24లో ఈ నష్టం రూ.6,960 కోట్లు కాగా, FY26లో ఇది రూ. 3,740 కోట్లకు తగ్గుతుందని నివేదిక తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు, వినియోగ పెరుగుదల ఆధారంగా FY26లో జీఎస్టీ కారణంగా కేంద్రానికి సుమారు రూ. 3,700 కోట్ల ఆదాయ నష్టంమాత్రమే జరుగుతుందని SBI పేర్కొంది.

వార్షిక ప్రాతిపదికన, ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల నికర ప్రభావాన్ని రూ. 48 వేల కోట్ల నష్టంగా అంచనా వేసినప్పటికీ, వినియోగం పెరుగుదల కారణంగా SBI లెక్కలు ఇది కేవలం 1 బేసిస్ పాయింట్ (0.01%) ఆర్థిక లోటుపై ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. ఇది తాత్కాలిక ప్రోత్సాహం కాదని దీర్ఘకాలిక నిర్మాణాత్మక సంస్కరణ అని SBI స్పష్టం చేసింది. SBI ప్రకారం ఇప్పటి వరకు 295 నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గాయి. రేట్లు 12% నుండి 5% లేదా జీరో స్థాయికి పడిపోయాయి.
ఆహార వస్తువులపై పాస్-త్రూ ప్రభావం 60 శాతం ఉంటుందని, దీని వలన FY26లో CPI ద్రవ్యోల్బణం 25-30 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని SBI అంచనా వేసింది. సేవలపై జీఎస్టీ హేతుబద్ధీకరణ మరో 40-45 బేసిస్ పాయింట్ల CPI తగ్గింపుకు దారితీస్తుంది. ఇతర వస్తువులు, సేవలపై 50 శాతం పాస్-త్రూ ప్రభావం కారణంగా మొత్తం ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని నివేదిక పేర్కొంది. కొత్తగా వచ్చిన GST మార్పులు వ్యాపారాలపై ఉన్న కాంప్లయెన్స్ భారాన్ని తగ్గిస్తుంది. అలాగే స్వచ్ఛంద పన్ను చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. పన్ను ఆధారాన్ని విస్తృతం చేస్తుందని నివేదిక తెలిపింది. కొత్త విధానం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల వృద్ధి అవకాశాలను అందిస్తుందని SBI అంచనా వేసింది.


Click it and Unblock the Notifications