GST News: లక్ష కంపెనీలపై ఇన్వెస్టిగేషన్.. నకిలీల పనిపడుతున్న జీఎస్టీ అధికారులు..
GST News: జీఎస్టీ విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావటంతో పాటు దానిని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను సైతం వినియోగిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక మోసాలు వరుసగా బయటపడుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.25 లక్షల కంపెనీలపై జీఎస్టీ శాఖ ఉచ్చు బిగించనుంది. ఈ కంపెనీలు జీఎస్టీ చెల్లించకుండా తప్పుడు ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు కంపెనీలకు నోటీసులు ఇచ్చి కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారులు విచారణను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ప్రఖ్యాత కంపెనీలు కూడా ఉన్నాయని సమాచారం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ రెండు నెలల ప్రత్యేక దర్యాప్తు డ్రైవ్ మే 14- జూలై 14 మధ్య నిర్వహించింది. ఇందులో 77,200 సంస్థలపై విచారణ జరపగా.. 20,800 నకిలీవని తేలింది. దీని తర్వాత రెండో దశలో అధికారులు 1.25 లక్షల కంపెనీలను విచారిస్తున్నారు. చాలా కంపెనీలు ఉత్పత్తిలో వినియోగించే ముడి పదార్థాలపై చెల్లించే పన్నుకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ జీఎస్టీ తిరిగి అందిస్తుంది. అయితే ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే నకిలీ బిల్లులతో కొందరు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నందున అధికారులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
అంతర్గత సమాచారంతో పాటు ఇతర శాఖల నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఆధారంగా అనుమానాస్పద కంపెనీల జాబితాను తయారు చేస్తారు. దీనికి తోడు వ్యాపారవేత్తలు దాఖలు చేసే కార్పొరేట్ టాక్స్ రిటర్న్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ డైటాను ఇందుకు వినియోగిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.01 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత గుర్తించబడింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.


Click it and Unblock the Notifications