GST News: దేశంలో ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అయితే వాటికి తగినట్లుగా ఆదాయాలు రాకపోవటం కేంద్ర సర్కారును కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను ఎగవేత నుంచి ఆదాయపు పన్ను వరకు జరుగుతున్న ఎగవేతలపై అధికారులు దృష్టి సారించారు.
దీంతో జీఎస్టీ ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఫైలింగ్ విధానంలోనూ అనేక మార్పులను తీసుకొస్తోంది. చిన్న వ్యాపారులను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పన్ను వసూళ్లను పెంచాలని కేంద్రం చూస్తోంది. అయితే ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1.36 లక్షల కోట్ల జీఎస్టీ పన్నును ఎగవేస్తున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ భారీ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ కింద డిపార్ట్‌మెంట్ పెద్ద సంఖ్యలో బోగస్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌ల కేసులను వెలికితీసింది. గత మూడున్నరేళ్లలో రూ.57,000 కోట్ల జీఎస్టీ ఎగవేతను డీజీజీఐ గుర్తించింది. ఈ కేసుల్లో దాదాపు 500 మందిని అరెస్ట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో రూ.14,000 కోట్ల విలువైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించిన మొత్తం 1040 కేసులను గుర్తించి, ఇప్పటివరకు 91 మందిని అరెస్టు చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో బోగస్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో సహా మొత్తం రూ.1.36 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత గుర్తించబడింది. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా రూ.14,108 కోట్లు డిపాజిట్ చేశారు. జూన్ 2023లో DGGI దేశవ్యాప్తంగా సిండికేట్‌ల సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమార్కులను గుర్తించేందుకు జీఎస్టీ అధికారులు నూతన డేటా అనలిటిక్స్ సాంకేతికతను వినియోగించారు. కొందకు అమాయకుల నుంచి ఉద్యోగాలు, రుణాల పేరుతో వారి కేవైసీ పత్రాలను వాటి ద్వారా షెల్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సో మీ వివరాలు ఎవరైనా ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications