కరోనా వ్యాక్సీన్ పైన పన్ను కోత ఉండకపోవచ్చు, తగ్గిస్తే సామాన్యుడికి భారమే!
కరోనా నేపథ్యంలో మెడికల్ ఉత్పత్తులపై పన్నుభారం తప్పడం లేదు . శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. కరోనా బాధితులకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపించడంలేదు. వ్యాక్సిన్‌తో పాటు పీపీఈ కిట్స్, ఎన్95 మాస్కులు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, ఆర్టీ-పీసీఆర్ మెషీన్లు తదితర ఇతర కరోనా రిలీఫ్ ఉత్పత్తులపై పన్నులు యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఆయా ఉత్పత్తులు, సేవలపై పన్ను స్లాబ్స్ మార్పుకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్‌కు సలహాలు ఇచ్చే ఫిట్మెంట్ కమిటీ వీటి తగ్గింపుకు సిఫార్సు చేయకపోవడమే కారణమని చెబుతున్నారు. వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కుల పైన కనిష్ఠంగా 5 శాతం జీఎస్టీ ఉన్నందున కమిటీ వీటి జోలికి వెళ్లలేదని తెలుస్తోంది.

వ్యాక్సీన్ పైన పన్ను ఎత్తివేత
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వ్యాక్సీన్ పైన పన్ను ఎత్తివేయాలా, వద్దా అనేది చర్చనీయాంశంగా మారింది. కరోనా నుండి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ మార్గమని భావిస్తోన్న సమయంలో దీనిని అందరికీ అందుబాటులో ఉంచవలసిన అవశ్యకత ఉంది. వ్యాక్సీన్ పైన జీఎస్టీ ఎత్తివేస్తే ధరలు ఇష్టారీతిన పెరుగుతాయని భావించడం కూడా జీఎస్టీ నుండి తొలగించకపోవడానికి మరో కారణం.
లాక డౌన్‌తో ఆర్థిక వ్యవస్థను స్తంభింప చేయడానికి బదులు వ్యాక్సీన్ పైన పన్ను ఎత్తివేస్తే వచ్చే నష్టం తక్కువ అనేది మరికొందరు నిపుణుల మాట. పన్నులు సడలించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు.

జీఎస్టీ తొలగిస్తే
కరోనా వ్యాక్సీన్ పైన జీఎస్టీని తొలగించాలని పశ్చిమ బెంగాల్‌తో పాటు పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఇటీవల కేంద్రాన్ని కోరాయి. అయితే జీఎస్టీని మాఫీ చేస్తే వ్యాక్సిన్ ధరలు పెరుగుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అన్నారు. జీఎస్టీ నుండి పూర్తిగా మినహాయింపు కల్పిస్తే దేశీయ తయారీదారులు ముడిపదార్ధాలు, సేవలకు చెల్లించిన పన్నులను తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలు పెంచుతారని, తద్వారా వినియోగదారులపై భారం పడుతుందన్నారు.
అయితే పూర్తిగా మినహాయింపు ఇవ్వకుండా వ్యాక్సిన్లను సున్నా స్లాబ్స్‌లో చేర్చవచ్చునని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 0.1 శాతం కనీస పన్ను విధిస్తే తయారీదారులు ఇన్‌పుట్ ట్యాక్స్‌ని రీఫండ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

స్లాబ్స్ తగ్గింపు లేదు...
జీఎస్టీలో స్లాబ్స్‌ను తగ్గించే అంశంపై గత కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ దీనిపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రేపు (శుక్రవారం) జరగనున్న సమావేశంలో దీనిపై చర్చ జరగడం లేదని తెలుస్తోంది. కరోనా సంక్షోభం దృష్ట్యా ప్రస్తుతానికి వ్యాక్సీన్ పైన పన్ను అంశాలనే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీలో ప్రస్తుతం 0, 5, 12, 18, 28 శాతం స్లాబ్స్ ఉన్నాయి. ఇందులో 12, 18 స్లాబ్స్‌ను కలిపి కలిపి కొత్త శ్లాబును తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.


Click it and Unblock the Notifications