గుడ్ న్యూస్.. రూ.10 వేల లోపు పన్ను బకాయిలకు నోటీసులు ఉండవు.. జీఎస్టీ అధికారులకు అరెస్ట్ అధికారాలు రద్దు..
GST Council: కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో జరిగిన వస్తువులు, సేవల పన్ను (GST) మండలి సమావేశంలో దేశీయ వ్యాపార వాతావరణాన్ని సరళతరం చేసే దిశగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
పన్ను చెల్లింపుదారులపై ఉన్న అనవసర వేధింపులను అరికట్టడానికి, ప్రక్రియలను మరింత పారదర్శకంగా మార్చడానికి కౌన్సిల్ పలు కీలక సవరణలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా జీఎస్టీ చట్టం కింద నేరుగా అరెస్టు చేసే కఠిన నిబంధనను రద్దు చేయాలని కౌన్సిల్ నిర్ణయించడం వ్యాపార వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. దీంతోపాటు జీఎస్టీ కింద ప్రాసిక్యూషన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 1 కోటి నుండి ఏకంగా రూ. 5 కోట్లకు పెంచారు.
చిన్న వ్యాపారులు, పన్ను చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేలా జీఎస్టీ నోటీసుల జారీలో స్పష్టమైన పరిమితిని విధించారు. ఇకపై రూ. 10,000 లోపు ఉండే పన్ను డిమాండ్లకు ఎలాంటి జీఎస్టీ నోటీసులు జారీ చేయకూడదని మండలి నిర్ణయించింది. అదేవిధంగా సాధారణ జరిమానా మొత్తాన్ని రూ. 25,000 నుండి రూ. 10,000కు తగ్గించారు.

వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్ల వరకు ఉన్న చిన్న వ్యాపారాలకు సులభతరంగా వార్షిక రిటర్న్‌లను ఫైల్ చేసే సౌకర్యం కల్పించారు. చిన్న ఇ-కామర్స్ వ్యాపారులకు, తక్కువ రిస్క్ ఉన్న దరఖాస్తుదారులకు స్వయంసిద్ధంగా (ఆటోమేటిక్) జీఎస్టీ రిజిస్ట్రేషన్ అందించనున్నారు. వ్యాపారాన్ని మూసివేసే (GST Closure) ప్రక్రియను కూడా దశలవారీగా డిజిటల్ విధానంలో ఆటోమేట్ చేయనున్నారు.
పన్ను రీఫండ్ ప్రక్రియలో విపరీతమైన జాప్యాన్ని నివారించేందుకు కౌన్సిల్ సరికొత్త నిబంధనను తెచ్చింది. ప్రతిపాదిత నూతన వ్యవస్థ కింద దాఖలైన రీఫండ్ క్లెయిమ్‌లలో 90 శాతాన్ని కేవలం 3 రోజుల్లోనే ఆమోదించి నిధులను విడుదల చేయనున్నారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద సమగ్ర క్రెడిట్, రీఫండ్‌లకు ఆమోదం లభించింది.
పరిశ్రమల ఆర్థిక రక్షణను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై, ఫ్యాక్టరీల వెలుపల నిర్మించే టెలికాం టవర్లు, పైప్‌లైన్లపై జీఎస్టీ క్రెడిట్‌ను ఆమోదించారు. ఉచిత నమూనాలు (Free Samples), గడువు ముగిసిన స్టాక్‌లపై కూడా క్రెడిట్ ప్రయోజనం లభించనుంది. ప్లాంట్, మెషినరీ క్రెడిట్‌పై జీఎస్టీ రీఫండ్‌ను ఏప్రిల్ 1, 2027 నుండి అమలు చేయనున్నారు.
పాలనలో పారదర్శకతను పెంచేందుకు ఆదాయపు పన్ను శాఖ తరహాలోనే సెంట్రల్ జీఎస్టీ (CGST)కి సంబంధించి 'ఫేస్‌లెస్ అసెస్‌మెంట్' (Faceless Assessment) విధానాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ సమావేశంలో జీఎస్టీ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతేకాకుండా ఇకపై పన్ను రేట్ల సమీక్ష, మార్పులను ఏటికేడాది కాకుండా సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరిశీలించాలని నిర్ణయించారు. చాలా కాలంగా చర్చల్లో ఉన్న డిజిటల్ చెల్లింపుల మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు.
ఈ విధివిధానాల సరళీకరణ పట్ల పారిశ్రామిక రంగాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, పన్ను నిబంధనల సరళీకరణ ప్రక్రియలన్నీ ఏప్రిల్ 1, 2027 నాటికి అధికారికంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయాలు దేశంలో సులభతర వాణిజ్యాన్ని (Ease of Doing Business) మరింత ముందుకు తీసుకెళ్తాయని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
