ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం GST ఫిక్స్.. అక్టోబర్ 1 నుంచి అమలు.. అందులో కొంత ఉపశమనం
GST on gaming: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ముఖ్యంగా ఆన్ లైన్ గేమింగ్ పై విధించిన ట్యాక్స్ పై పలువురు సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో సదరు కంపెనీలకు కౌన్సిల్ కొంతమేర ఉపశమనం ఇచ్చింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు GST కౌన్సిల్ సమావేశమైంది. జూలై 11న జరిగిన మీటింగ్ లో ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం ట్యాక్స్ విధించాలని భావించగా.. దీనిపై ప్రధానంగా ఇవాళ చర్చ జరిగింది. ఎట్టకేలకు గేమింగ్ కంపెనీలకు కొంత ఉపశమనాన్ని ఇస్తూ.. గెలిచిన నగదుపై కాకుండా కేవలం కస్టమర్స్ లోడ్ చేసిన అమౌంట్ కు మాత్రమే GST వర్తింప చేయాలని నిర్ణయించింది. ఇవే నిబంధనలు క్యాసినోలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం GSTని ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీని అమలుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. తద్వారా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. అయితే కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరాల దృష్ట్యా.. 6 నెలల అనంతరం తరిగి దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు.
'తమకు కొంత వెసులుబాటు కల్పించాలని గోవా, సిక్కిం రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రానున్న 6 నెలల్లో నిబంధనలు అమలు, వాటి పర్యవసానాలపై మాకు కొంత సమాచారం అందుతుంది. దాని ఆధారంగా GST అమల్లోకి వచ్చిన 6 నెలల తరువాత ఈ నిర్ణయంపై తిరిగి రివ్యూ చేస్తాము' అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications