రూ.1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు, నవంబర్‌దే థర్డ్ హయ్యెస్ట్
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఉద్ధీపన చర్యల కారణంగా నవంబర్ నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) రెవెన్యూ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటాయి. అంతకుముందు వరుసగా మూడు నెలల పాటు జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు మార్క్ చేరుకోలేదు. పైగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్ర మందగమనంలో ఉంది. అయితే మోడీ ప్రభుత్వం చర్యలతో వసూళ్లు ఇప్పుడు రూ.లక్ష కోట్లు దాటాయి.
నవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,03,492 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీజీఎస్టీ రూ.19,592 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.27,144 కోట్లు, ఐజీఎస్టీ కలెక్షన్లు రూ.49,028 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.20,948 కోట్ల ఇంపోర్ట్స్ కలెక్షన్లు ఉన్నాయి. సెస్ రూ.7,727 కోట్లుగా ఉంది. ఇందులో రూ.869 కోట్లు ఇంపోర్ట్స్ ద్వారా వచ్చింది.

జీడీపీ తగ్గుదల, ఆర్థిక మందగమనం నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు మంచి వృద్ధిని సాధించాయి. 2018 నవంబర్ నెలలోని వసూళ్ల కంటే ప్రస్తుత నవంబర్ నెలలో వసూళ్లలో 6 శాతం పెరుగుదల ఉంది.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లు కాగా, సెప్టెంబర్ నెలలో రూ.91,916 కోట్లు, ఆగస్ట్ నెలలో రూ.98,202 కోట్లుగా ఉన్నాయి. 2018 ఫిబ్రవరి తర్వాత సెప్టెంబర్ నెలలో నమోదైన కలెక్షన్లు కనిష్టం. వివిధ కారణాలతో వరుసగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్ల కంటే తక్కువగా నమోదయ్యాయి.
2017 జూలై నెలలో జీఎస్టీని తీసుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 8 సార్లు రూ.1 లక్ష కోట్ల వసూళ్లు జరిగాయి. ఇప్పుడు నవంబర్‌లోని కలెక్షన్లు థర్డ్ హయ్యెస్ట్. ఈ ఏడాది ఏప్రిల్, మార్చి నెలలు అత్యధిక వసూళ్లు సాధించి టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications