GST 2.0 కొత్త పన్ను విధానం నేటి నుంచి అమల్లోకి.. తొలి రోజే ఈ కార్ల ధరలు లక్ష రూపాయలకు పైగానే తగ్గాయి
సెప్టెంబర్ 22, 2025న దేశవ్యాప్తంగా పెద్ద మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ 2.0 కొత్త పన్ను విధానం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. దీని వల్ల సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం దక్కనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. సామాన్యులు తరచూ ఉపయోగించే వస్తువులు మాత్రమే కాకుండా, కార్లు, బైకులు, టెలివిజన్లు వంటి గృహోపకరణాలు కూడా ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి.
గతంలో మోటారు వాహనాలపై 28 శాతం జీఎస్టీతో పాటు, వాహనం రకాన్ని బట్టి 1 శాతం నుండి 22 శాతం వరకు పరిహార సెస్ విధించారు. అంటే, పెద్ద కార్లు లేదా లగ్జరీ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు పన్ను భారం విపరీతంగా పడేది. అయితే కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన GST సవరణల విధానం ప్రకారం.. మోటారు వాహనాలను కేవలం రెండు వర్గాల కిందకు తీసుకువచ్చారు. ఒకటి 18 శాతం పన్ను చెల్లించాల్సిన వాహనాలు, మరొకటి 40 శాతం పన్ను చెల్లించాల్సిన వాహనాలు. ఇకపై ఎటువంటి పరిహార సెస్ విధించబడదు.

ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా చిన్న కార్లు కొనుగోలు చేయదలచిన వారికి ఎంతో మేలు జరగనుంది. పెట్రోల్, LPG లేదా CNGపై నడిచే, 1,200 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన, అలాగే 4 మీటర్ల లోపు పొడవు ఉన్న కార్లపై ఇప్పుడు కేవలం 18 శాతం మాత్రమే పన్ను విధించబడుతుంది. డీజిల్ కార్ల విషయంలో కూడా ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ లోపు ఉంటే ఇదే రాయితీ వర్తిస్తుంది. మరోవైపు, పెద్ద వాహనాలు లేదా లగ్జరీ కార్లకు 40 శాతం జీఎస్టీ విధించబడుతుంది. అయితే సెస్ తొలగించబడినందున ఈ వర్గానికి చెందిన వాహనాల ధరలూ గతంతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటాయి.
ఈ మార్పులు ప్రకటించగానే దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు.. టాటా, హ్యుందాయ్, హోండా, స్కోడా, మహీంద్రా, టయోటా వంటి సంస్థలు తమ వాహన ధరలను తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే మోడళ్లపై కూడా గణనీయమైన తగ్గింపులు వచ్చాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ తన వాహనాలపై ఆకర్షణీయమైన ధరల తగ్గింపులను ప్రకటించింది. నెక్సాన్ మోడల్ ధర రూ. 1.55 లక్షల వరకు తగ్గించింది. సఫారీపై రూ. 1.45 లక్షల తగ్గింపు లభించగా.. హారియర్ ధర రూ. 1.40 లక్షల వరకు తగ్గింది. పంచ్, కర్వ్, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ వంటి మోడళ్లపైనా రూ. లక్షలోపు తగ్గింపులు వచ్చాయి.
టాటా కార్లు ఎంత చౌకగా అయ్యాయి?
టాటా నెక్సాన్ - రూ. 1.55 లక్షల వరకు తగ్గింపు
టాటా సఫారీ - రూ. 1.45 లక్షల తగ్గింపు
టాటా హారియర్ - రూ. 1.40 లక్షల తగ్గింపు
టాటా పంచ్ - రూ. 85,000 తగ్గింపు
టాటా కర్వ్ - రూ. 65,000 తగ్గింపు
టాటా టియాగో - రూ. 75,000 తగ్గింపు
టాటా టిగోర్ - రూ. 80,000 తగ్గింపు
టాటా ఆల్ట్రోజ్ - రూ. 1.10 లక్షల తగ్గింపు
GST 2.0 తగ్గింపులు కేవలం సంఖ్యల పరిమితి మాత్రమే కాకుండా, వినియోగదారుల జీవితాల్లో నిజమైన మార్పుని తీసుకురానున్నాయి. మధ్యతరగతి కుటుంబం కారు కొనుగోలు చేసే సమయంలో ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సవాల సీజన్‌లో కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం కానుంది. ఆటోమొబైల్ రంగానికి కూడా ఇది కొత్త ఊపును ఇస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాహనాల అమ్మకాలు మందగించిన నేపథ్యంలో, పన్ను తగ్గింపులు విక్రయాలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications