గృహ లక్ష్మి, గృహ జ్యోతి లబ్ధిదారులకు షాక్.. దరఖాస్తులు మళ్లీ సమర్పించాలన్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్..
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం నిర్వహించిన ఉన్నతాధికారుల కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గ్యారెంటీ పథకాల పునఃసమీక్షతో పాటు పరిపాలనా సంస్కరణలపై పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల లబ్ధిదారుల జాబితాలో మరణించిన వారు, అనర్హులు ఉన్నట్లు గుర్తించడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి కుటుంబంలోని మహిళా గృహ పెద్దకు నెలకు రూ. 2,000 అందించే గృహలక్ష్మి పథకం కింద దాదాపు రూ. 100 కోట్లు మరణించిన లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాయని, కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులు వేరొకరి ఫోన్ నంబర్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఈ నిధులు నేరుగా రుణ చెల్లింపులకు, పాంజీ స్కీమ్‌లకు లేదా ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకులకు వెళ్తున్నాయా అనేదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. అలాగే, 1.64 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్న గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకంలో కూడా కొంతమంది ఒకే పేరు మీద ఐదు మీటర్లు నమోదు చేసుకున్నారని, దుకాణాల వంటి వాణిజ్య అవసరాలకు దీనిని వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ ధరల నేపథ్యంలో వ్యాపార ప్రయోజనాలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేమని, అందువల్ల సమాచారాన్ని సరిచూడడం కోసం ఈ రెండు పథకాల లబ్ధిదారులు తమ దరఖాస్తులను కొత్తగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అర్హులైన నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఐడెంటిటీ కార్డులు ఇస్తామే తప్ప ఎవరినీ తొలగించబోమని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో 'అవినీతి రహిత కర్ణాటక'ను సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నొక్కిచెబుతూ, ఎవరైనా లంచం అడిగితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతి తాలూకా, జిల్లా కార్యాలయాలలో ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యవర్తులు, బలవంతపు వసూళ్లకు పాల్పడేవారిని ఏరివేస్తామని, మంత్రులు లేదా ఎమ్మెల్యేల నుండి ఎలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు లేదా ఒత్తిళ్లు వచ్చినా వాటిని పాటించకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని డీసీలు, ఎస్పీలకు సూచించారు. అధికారులందరూ ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి హాజరుకావాలని, బయోమెట్రిక్ వేయగానే ఆ సమాచారం నేరుగా ప్రధాన కార్యదర్శికి వెళ్తుందని తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారుల చిరునామాలు, ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్లలో ఉంచాలన్నారు.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, తాగునీరు, పశుగ్రాసం, విత్తనాలు , ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల ఎరువుల సరఫరాలో తలెత్తే సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలు తమ సమస్యల కోసం బెంగళూరు లేదా జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా, తాలూకా స్థాయిలో మంత్రులు 'జన సంపర్క సభలు', ఎమ్మెల్యేలు హోబ్లీ స్థాయిలో సభలు నిర్వహించి అక్కడికక్కడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అలాగే, ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు గానూ ప్రత్యేక విస్తృత పునర్విమర్శ (SIR) ప్రక్రియలో భాగంగా జిల్లా మంత్రులు, డీసీలు ప్రతి తాలూకాను సందర్శించి బూత్ స్థాయి అధికారులకు (BLO) మార్గదర్శకత్వం చేయాలన్నారు.
వీటితో పాటు, ప్రభుత్వ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత బస్సు పాస్‌ల పంపిణీ, యువత సాధికారత కోసం 10,000 'భారత్ జోడో యువ సంఘాల' ఏర్పాటు, ప్రైవేట్ రంగ ఉద్యోగాల కోసం ప్రత్యేక ఉపాధి కేంద్రాల స్థాపన వంటి తొలి మంత్రివర్గ నిర్ణయాలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రతి పట్టణం , జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా గ్రామీణ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు గానూ మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, పోంజీ స్కీమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్ని పోలీస్ స్టేషన్ల స్థాయిలో రౌడీ నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.


Click it and Unblock the Notifications
