Go First: గత నెలలో అనుకోకుండా గ్రౌండ్ అయిన బడ్జెట్ విమానయాన సంస్థ గోఫస్ట్ తాను చెప్పిన మాట నిలబెట్టుకుంటోంది. ఏది ఏమైనా తిరిగి వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది.
గోఫస్ట్ తన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమర్పించింది. వీలైనంత త్వరగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ముందుకెళ్తోంది. దీనికోసం పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. మెుత్తం 26 విమానాలతో తిరిగి సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో నాలుగు బ్యాకప్ ప్లేన్స్ కూడా ఉన్నాయని తెలిపింది. దేశంలోని 78 రూట్లలో 22 విమానాశ్రయాల నుంచి 160 రోజువారీ విమాన సేవలను నడపనున్నట్లు డీజీసీఏకి తెలిపింది.

అన్ని పత్రాల పరిశీలన తర్వాత గోఫస్ట్ సంసిద్ధతను అంచనా వేసేందుకు డీజీసీఏ వచ్చేవారం ఆడిట్ నిర్వహించనుందని వెల్లడైంది. ఒక రోజు కార్యకలాపాలకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతుందని భావించి రుణదాతలు దాదాపు రూ.450 కోట్ల మధ్యంతర ఆర్థికసాయం అందించారు. ఒకవేళ సేవలను కంపెనీ తిరిగి ప్రారంభిస్తే దేశీయ విమానయాన చరిత్రలో దివాలా తీసిన కంపెనీ బతకటం తొలిసారిగా చరిత్ర సృష్టించనుంది. అయితే కంపెనీకి ఈ గతి పట్టడానికి US-ఆధారిత ఇంజిన్ తయారీదారు ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్ల సరఫరా ఆలస్యమే కారణమని వాడియా యాజమాన్యంలోని గోఫస్ట్ ఆరోపించింది.

NCLT కోర్టు ఎయిర్‌లైన్ అభ్యర్థనను అంగీకరించి.. రుణదాతలు, అద్దెదారులు, విమానాశ్రయాలు, నియంత్రణదారుల నుంచి ఎయిర్‌లైన్‌ను రక్షించడానికి మధ్యంతర స్టే ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ 10న ఎయిర్‌లైన్స్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(CoC)ని ఏర్పాటు చేసిన తర్వాత EY-మద్దతుగల రిజల్యూషన్ ప్రొఫెషనల్ శైలేంద్ర అజ్మీరా, తాత్కాలిక CEO కౌశిక్ ఖోనా DGCA అధికారులకు ఎయిర్‌లైన్ రికవరీ వ్యూహాన్ని సమర్పించగా తాజా పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంక్, డ్యూయిష్ బ్యాంక్ కంపెనీకి రుణాలు ఇచ్చిన సంస్థల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications