GST April revenue: రూ.1,41,384 లక్షల కోట్లు: సంక్షోభంలోనూ ఆల్‌టైమ్ రికార్డ్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని ఆవరించుకున్న వేళ.. ఇది వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అనేక రాష్ట్రాలు తమకు తాముగా ఆంక్షలను విధించుకుని, లాక్‌డౌన్‌లోకి జారిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రికార్డు స్థాయిలో జీఎస్టీ (GST) వసూళ్లు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల నెలకొన్న సంక్షోభకర పరిస్థితుల్లో దిమ్మతిరిగే రేంజ్‌లో జీఎస్టీ రెవెన్యూ రికార్డయింది. ఏప్రిల్ తొలివారంలో ఆరంభమైన కరోనా సంక్షోభం రెండు వారాలు గడిచే సమయానికి పతాకస్థాయికి చేరింది. అయినప్పటికీ.. ఆ నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాయి.
కిందటి నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,41,384 కోట్ల రూపాయలు. దేశంలో జీఎస్టీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత.. ఈ స్థాయిలో వసూళ్లు ఎప్పుడూ నమోదు కాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ ఇందులో సెంట్రల్ జీఎస్టీ (CGST)-27,837 కోట్లు కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST)-35,621 కోట్ల రూపాయలు. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రెవెన్యూ మొత్తం 68,481 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో సరుకుల దిగుమతి ద్వారా నమోదైన జీఎస్టీ మొత్తం 29,599 కోట్ల రూపాయలు. వేర్వేరు రంగాలపై విధించిన సెస్ ద్వారా 9,445 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సరుకుల దిగుమతులపై విధించిన సెస్ ద్వారా 981 కోట్ల రూపాయలను ఇందులోనే మిళితం చేసినట్లు తెలిపింది. కాగా- లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వరుసగా ఇది ఏడోసారి. ఇదివరకు ఆరు నెలలుగా నెలవారీ జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు పైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వల్ల సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. గరిష్ఠ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అందాయని తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ బకాయిలను కూడా పెద్ద సంఖ్యలో చెల్లించడం వల్లే ఈ మార్క్ అందుకున్నట్టయిందని తాము అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications