కొత్త లేబర్ కోడ్స్.. గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పులు.. 5 ఏళ్లకు బదులుగా ఏడాదికే..
భారతదేశంలో కార్మిక సంక్షేమ దిశగా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. నవంబర్ 2025లో అమలులోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలు (New Labour Codes) గ్రాట్యుటీ నిబంధనలలో సమూల మార్పులను తీసుకువచ్చాయి. గతంలో ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలంటే కనీసం ఐదేళ్ల నిరంతర సేవ తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన ఉండేది, కానీ కొత్త మార్పుల ప్రకారం ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం తర్వాతే ఈ ప్రయోజనాన్ని పొందే అవకాశం కలిగింది.
సాధారణంగా గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి ఒక సంస్థకు అందించిన దీర్ఘకాలిక సేవలకు గుర్తింపుగా, పదవీ విరమణ సమయంలో లేదా ఉద్యోగం వదిలివేసేటప్పుడు యజమాని ఇచ్చే ఆర్థిక బహుమతి. చట్టం ప్రకారం, పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ తన అర్హులైన ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించడం తప్పనిసరి.

ఈ కొత్త నిబంధనలు నవంబర్ 21, 2025 నుండి అధికారికంగా అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రకారం, ఈ తేదీ తర్వాత కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులకు మాత్రమే ఒక సంవత్సరం నిబంధన వర్తిస్తుంది. అయితే, ఈ ఒక సంవత్సరం గ్రాట్యుటీ సౌకర్యం ఉద్యోగులందరికీ ఒకేలా వర్తించదు. ప్రధానంగా నిర్ణీత కాలం (Fixed-term) పని చేసేవారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈ మార్పు పెద్ద ఊరటనిస్తుంది.
ఒక రాతపూర్వక ఒప్పందం ప్రకారం నిర్దిష్ట కాలం పాటు పనిచేసే వీరికి, వారు పనిచేసిన కాలానికి అనుగుణంగా అంటే దామాషా పద్ధతిలో గ్రాట్యుటీని లెక్కిస్తారు. కానీ, రెగ్యులర్ లేదా శాశ్వత ఉద్యోగులు గ్రాట్యుటీ క్లెయిమ్ చేయాలంటే ఇప్పటికీ సాధారణంగా ఐదేళ్ల సేవ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవలం ఉద్యోగి మరణించినా లేదా వైకల్యానికి గురైనా మాత్రమే ఈ ఐదేళ్ల నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది.
గ్రాట్యుటీ లెక్కింపు విధానంలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త చట్టం ప్రకారం.. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి యొక్క 'వేతనం'పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వేతనం అంటే కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా, మూల వేతనం, కరువు భత్యం (DA), రిటైనింగ్ అలవెన్స్‌ల కలయికగా పరిగణిస్తారు. ముఖ్యంగా, ఒక ఉద్యోగి యొక్క మొత్తం జీతం (CTC)లో ఈ వేతనం కనీసం 50 శాతం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీనివల్ల గతంలో తక్కువ బేసిక్ పే ఉండి, ఇతర భత్యాలు ఎక్కువగా పొందిన ఉద్యోగులకు ఇప్పుడు అందే gratuity మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంస్కరణలు లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడమే కాకుండా, వారి పదవీ విరమణానంతర జీవితానికి ఆర్థిక భరోసానిస్తాయి.


Click it and Unblock the Notifications