Adani: రోజూ పడుతున్న అదానీ స్టాక్స్.. రాబడి భారీగా రానుందన్న రాజీవ్ జైన్.. ఇదీ కారణం!
Adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ సృష్టించిన సునామీ నుంచి అదానీ కంపెనీలు ఇప్పటికీ కోలుకోలేదు. గ్రూపు అధినేత రంగంలోకి దిగి ఎన్ని చర్యలు తీసుకున్నా, అంతగా సత్ఫలితాలు కనిపించలేదు. రోజూ భారీ నష్టాలను మూటగట్టుకుంటూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో, అదానీ షేర్లు త్వరలోనే భారీ లాభాలను ఇస్తాయని ఏకంగా ఓ సంస్థ ఛైర్మన్ అభిప్రాయపడటం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అదానీ గ్రూపు కంపెనీలపై GQG పార్టనర్స్ ఛైర్మన్ రాజీవ్ జైన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 5 ఏళ్లలోనే 100 శాతం లాభాలు ఇస్తాయంటూ ప్రముఖ సంస్థ బ్లూమ్ బర్గ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇంత జరిగినా తాను విశ్వాసం కోల్పోలేదని, త్వరలోనే అవి మల్టీబ్యాగర్ గా మారతాయని చెప్పారు. అదానీ కంపెనీల్లో ఈయన గత నెలలో 15 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడం విశేషం.

నిజానికి హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ 150 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది. ఇంతటి దారుణ స్థితిలోనూ అదానీ గ్రూపును నమ్మడానికి కారణం సంస్థ ఆస్తులేనని రాజీవ్ జైన్ తెలిపారు. అంతర్జాతీయంగా చైనాకు గట్టి పోటీ ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఈ తరుణంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ, తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి అదానీ తరహా వ్యాపారవేత్తల అవసరం దేశానికి ఉందన్నారు.
ఇండియా అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న పలు విభాగాల్లో అదానీ గ్రూపు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బొగ్గు గనులు, డేటా సెంటర్లు, పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు సంస్థకు ఉన్న మంచి వ్యాపారాలుగా భావిస్తున్నట్లు జైన్ చెప్పారు. హిండెన్ బర్గ్ నివేదికను పదేళ్ల క్రితం న్యూస్ పేపర్ అని అభివర్ణించారు. దాని వెలువడిన అనంతరం పెద్ద మొత్తంలో ఆ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications