Gowtham Adani: అదానీ నుంచి మరో IPO.. ఈ సారి ఫైనాన్స్ వ్యాపారంతో మార్కెట్ ముందుకు.. పూర్తి వివరాలు..
Gowtham Adani: ఈ మధ్య కాలంలో అదానీ దూకుడు శరవేగంగా పెరుగుతోంది. ఇది అది అనే తేడాలు లేకుండా అనేక రంగాల్లో వరుస కొనుగోళ్లు, కొత్త పెట్టుబడులతో వ్యాపారాలను భారీగా విస్తరిస్తున్నారు. ఇలా ఆయన రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. అదానీ సంపద సైతం రాకెట్ స్పీడుతో పెరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరుకోవటానికి ఈ దూకుడు బాగా ఉపకరించినట్లు కనిపిస్తోంది.

అదానీ మరో ఐపీవో..
గౌతమ్ అదానీకి సంబంధించిన.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అదానీ క్యాపిటల్ ఐపీవోపై కీలక ప్రకటన వెలువడింది. దీని ప్రకారం 2024 ప్రారంభంలో IPO తీసుకురావటం ద్వారా మార్కెట్ల నుంచి దాదాపు రూ.1,500 కోట్లను సమీకరించాలని చూస్తోంది. దీని ద్వారా.. అదానీ క్యాపిటల్ తన షేర్లలో 10% అమ్మకానికి ఉంచుతోంది. దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ CEO గౌరవ్ గుప్తా తెలిపారు.

నిధుల సమీకరణ ఇందుకే..
ప్రస్తుతం ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు, దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకదానిని నడుపుతున్నారు. అయితే అదానీ క్యాపిటల్ NBFC ఫైనాన్స్ సెక్టార్‌లో మైనర్ ప్లేయర్ గా కొనసాగుతోంది. పబ్లిక్ లిస్టింగ్ ద్వారా సమీకరించే క్యాపిటల్ వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడనుంది.

వినియోగదారులకు లోన్స్ ఇలా..
టెక్నాలజీని ఉపయోగిస్తూ రూ.30,000 నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలను అందిస్తున్న విభాగంలో తన మార్కెట్ వాటాను విస్తరించాలని అదానీ క్యాపిటల్ లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఫిన్‌టెక్ కంపెనీ కాదని.. కస్టమర్ల సంఖ్యను మరింత ప్రభావవంతంగా పెంచుకునేందుకు సాంకేతికతను వినియోగించే క్రెడిట్ కంపెనీ అని గుప్తా వెల్లడించారు.

కంపెనీ ప్రారంభం ఎప్పుడంటే..
అదానీ క్యాపిటల్ 2017లో ప్రారంభమైంది. ఇది ప్రధానంగా రిటైల్, గ్రామీణ ఫైనాన్సింగ్ విభాగంలో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో దాదాపుగా 154 శాఖలను కలిగి ఉంది.

లాభాల వివరాలు..
మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ క్యాపిటల్ NBFC రూ.16.3 కోట్ల నికర ఆదాయాన్ని కలిగి ఉంది. ఈ సమయంలో కంపెనీ లోన్ బుక్ విలువ దాదాపు రూ.3,000 కోట్లుగా ఉంది. దీనిని మరింత విస్తరింప చేయాలని, ప్రతి సంవత్సరం రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు గుప్తా వెల్లడించారు.


Click it and Unblock the Notifications