Q3 Results: ఇన్వెస్టర్లను నిరాశపరిచిన ప్రభుత్వ స్టాక్.. 90 శాతం పడిపోయిన లాభాలు..
HPCL Results: ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ హెచ్‌పిసిఎల్ తాజాగా నేడు తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ తన ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం రూ.529 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.5,118 కోట్ల కంటే 89.6శాతం తక్కువ కావటం గమనార్హం. దీంతో పెట్టుబడిదారులు కంపెనీ పనితీరుపై పూర్తి నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

అయితే గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.172 కోట్లతో పోల్చుకుంటే ప్రస్తుం 207 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడైంది. Q3FY24లో HPCL ఇండిపెండెంట్ మొత్తం ఆదాయం 15.5% పెరిగి రూ.1.02 లక్షల కోట్ల నుంచి రూ.1.18 లక్షల కోట్లకు చేరుకుంది. ఏడాది ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 2 శాతం పెరిగి రూ.1.16 లక్షల కోట్లకు చేరుకుంది. త్రైమాసికంలో నిర్వహణ ఆదాయం అంటే వడ్డీ పన్నులకు ముందు ఆదాయాలు(EBIT) 73.7% క్షీణించి రూ.8,217 కోట్ల నుంచి రూ.2,163 కోట్లకు పడిపోయింది.
మార్కెటింగ్ విషయంలో HPCL తన అత్యధిక త్రైమాసిక విక్రయాల పరిమాణం 11.90 MMT అక్టోబర్-డిసెంబర్ 2023లో సాధించింది. గత సంవత్సరం ఇదే కాలంలో 11.25 MMT కంటే 5.8% వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. ఇదే క్రమంలో కంపెనీ బోర్డు పెట్టుబడిదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.15 డివిడెండ్ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే అర్హత కలగిన పెట్టుబడిదారులకు ఇందుకోసం ఫిబ్రవరి 7, 2024ను రికార్డు తేదీగా కంపెనీ ప్రకటించింది. అలాగే ఫిబ్రవరి 23 నాటికి డివిడెండ్ ఇన్వెస్టర్ల ఖాతాలో జమచేయాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications