దేశంలో బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ ప్రతిపాదన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) నుండి వచ్చింది. వారంలో ప్రతి శనివారాన్ని సెలవుగా ప్రకటించాలని ఐబీఏ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం బ్యాంకులకు రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవు దినాలుగా ఉన్నాయి. అయితే వారానికి 5 రోజుల ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉందని లోక్ సభ వేదికగా కేంద్రం తెలిపింది.
జూలై 28, 2025న ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించింది. ఐబీఏ, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య 10వ ద్విపాక్షిక ఒప్పందం అనంతరం ఈ ప్రతిపాదన ముందుకు వచ్చిందని తెలిపింది. 2015లో రెండవ, నాల్గవ శనివారాలను సెలవుగా మార్చినప్పుడు కూడా ఇలాంటి ఒప్పందం తర్వాతే అటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) వద్ద తగినంత సిబ్బంది ఉన్నారని కేంద్రం తెలిపింది. తాజా ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. బ్యాంకుల్లో సిబ్బంది కొరత పెద్ద సమస్య కాదని.. 31 మార్చి 2025 నాటికి 96 శాతం మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. మిగిలిన కొద్దిమంది లేకపోవడానికి పదవీ విరమణలు, ప్రణాళిక లేని నిష్క్రమణలే కారణమని స్పష్టం చేసింది. బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా సంవత్సరానికొకసారి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయని కేంద్రం తెలిపింది

ఐదు రోజుల పని వారం వల్ల బ్యాంక్ ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని, పని ఒత్తిడి తగ్గుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) వంటి సంఘాలు వాదిస్తున్నాయి. పని, జీవితం మధ్య సమతౌల్యం సాధ్యమవుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రం బ్యాంక్ పనిదినాలు ఆరో రోజులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.
బ్యాంకులకు ఐదు రోజుల పని వారం విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఇది పరిశీలనలో ఉందని పార్లమెంటులో స్పష్టం చేసింది. బ్యాంకు యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం కలిసి చర్చించి దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరికొద్ది నెలల్లో ఈ ప్రతిపాదనపై తుది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతానికైతే ఆరు రోజుల పనిదినాలు కంటిన్యూ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
ఇక దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్న సేవలపై సేవా ఛార్జీలు వసూలు చేస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టతనిచ్చింది. జూలై 28, 2025న జరిగిన పార్లమెంటు సమావేశంలో, ఎంపీలు డాక్టర్ టి. సుమతి అలియాస్ తమిజాచి తంగపాండియన్, డిఎం కతిర్ ఆనంద్ బ్యాంకులు సేవా రుసుముల ద్వారా పొందిన ఆదాయంపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో.. బ్యాంకులు తమ కస్టమర్లకు ఆన్‌లైన్‌లో కానీ, బ్రాంచ్‌ద్వారా కానీ అందించే వివిధ సేవలపై సహేతుకమైన సేవా ఛార్జీలను విధించడానికి వారికి అధికారాలున్నాయని తెలిపింది. ఇది బ్యాంకుల వ్యాపార మోడల్‌లో భాగంగా భావించబడుతోందని స్పష్టం చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన డిజిటల్ సేవల ద్వారా దాదాపు రూ.2,300 కోట్ల సేవా రుసుములు వసూలు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ సేవలలో ఖాతా నిర్వహణ ఛార్జీలు, డెబిట్ కార్డ్ ఫీజులు, NEFT/RTGS/IMPS మార్గాల ద్వారా మోనెట్‌రీ ట్రాన్సాక్షన్లు, ATM విత్‌డ్రాల్స్ మొదలైనవన్నీ ఉంటాయి.
కాగా కస్టమర్లకు బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లు, బ్రాంచ్‌ల ద్వారా ఛార్జీలను ఖచ్చితంగా తెలియజేయాలని నిబంధన ఉంది. ఈ సేవా ఛార్జీలు రెగ్యులేటరీ బాడీల పర్యవేక్షణలో ఉంటాయని, ముఖ్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తూ, బ్యాంకుల కార్యకలాపాల పర్యవేక్షణను కొనసాగిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది.డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. బ్యాంకులు కూడా సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని ప్రభుత్వం పేర్కొంది.


Click it and Unblock the Notifications