తీవ్ర నష్టాలు, రుణ భారంతో కుదేలవుతోన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు.
ఇటీవల లోక్‌సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని(ఏఐఎస్‌ఏఎం) పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు అందులో వివరించారు.

ఆ విమానాలు ఇతర ఎయిర్‌లైన్స్‌కు...
దాదాపు రూ.50 వేల కోట్ల రుణభారం ఉన్న ఎయిర్ ఇండియా .. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,556 కోట్ల నష్టాలు నమోదు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు నిధుల సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మూతబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ విమానాలను ఇతర ఎయిర్‌లైన్స్‌కు బదలాయించేందుకు కూడా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు హర్‌దీప్ సింగ్ పురి చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో...
అంతేకాకుండా, వచ్చే ఐదేళ్లలో దేశంలోని వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. దీనికోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రూ.25 వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు ఆయన వివరించారు.

‘‘డిజిన్వెస్ట్‌మెంట్ పారదర్శకంగా జరగాలి..''
దేశీయ విమాయాన రంగంలో పోటీతత్వం మెరుగుపడే విధంగా.. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ సక్రమంగా, పారదర్శక విధానంలో జరగాలని విమానయాన సంస్థల అంతర్జాతీయ సమాఖ్య ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ డి జునియాక్ అభిప్రాయపడ్డారు. భారత మార్కెట్లో గట్టి పోటీ, భారీ నిర్వహణ వ్యయాల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ అనేది ఆపరేటర్లకు చాలా కష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాకు ప్రస్తుతం ఇస్తున్న వనరులను.. మొత్తం ఏవియేషన్ రంగానికి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జునియాక్ సూచించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ...
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ విమానయాన సంస్థలు 600 మిలియన్ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదు చేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేస్తోంది. గతంలో వేసిన అంచనాలను ఈ సంస్థ తాజాగా సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 500 నుంచి 700 మిలియన్ డాలర్ల వరకు లాభాలు రావచ్చంటూ తొలుత ఈ ఏడాది జూన్‌లో సీఏపీఏ అంచనా వేసింది. అయితే జెట్ ఎయిర్‌వేస్ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు విఫలమయ్యాయని, కాబట్టి ఈ ఏడాదీ నష్టాలు తప్పకపోవచ్చంటూ సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది.


Click it and Unblock the Notifications