కేంద్రం మరో సంచలన నిర్ణయం.. మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం దిశగా..
భారత ప్రభుత్వ యాజమాన్యంలోని జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు కేంద్రం మళ్లీ శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు..ఓరియంటల్ ఇన్సూరెన్స్,నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల విలీనం ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి పునఃపరిశీలించడం ప్రారంభించింది. ఈ విలీనం ద్వారా సంస్థల ఆర్థిక స్థితిని బలపడించడం, కార్యాచరణలో సమర్థతను పెంచడం, ఖర్చులను తగ్గించడం, మార్కెట్ పోటీశక్తిని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు సాధ్యమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవలి సంవత్సరాల్లో ఈ మూడు కంపెనీలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2019-20 నుంచి 2021-22 మధ్యకాలంలో వాటిని నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.17,450 కోట్ల మూలధనాన్ని ఇంజెక్ట్ చేసింది. అంతేకాకుండా, కంపెనీల ఆర్థిక పరిస్థితి మరింత భారంగా ఉండటంతో, 2020లో ప్రభుత్వమే వెంటనే రూ.12,450 కోట్ల అదనపు మూలధనాన్ని అందించింది. ఈ చర్యలతో కంపెనీల స్థితి కొంతవరకు మెరుగుపడినప్పటికీ, దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి అని కేంద్రం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మూడు సంస్థలను ఒక్కటిగా విలీనం చేస్తే ఎంత మేరకు కార్యకారిత్వ లాభాలు పొందవచ్చో అనే అంశంపై ప్రాథమిక అంచనాలను నిర్వహిస్తోంది. ఖర్చుల తగ్గింపు, శాఖల ఆప్టిమైజేషన్, ఒకే బ్యాలెన్స్ షీట్‌తో శక్తివంతమైన మార్కెట్ నిలకడ, మెరుగైన టెక్నాలజీ వినియోగం వంటి అంశాలు విలీనానికే అనుకూలంగా ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో, కేంద్రం గతంలో ప్రకటించిన ఒక ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించే ప్రతిపాదనపై కూడా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఆ దిశలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. విలీనం, ప్రైవేటీకరణ, మూలధన పెంపు వంటి అన్ని మార్గాలను పరిశీలించి ఆ తర్వాతే కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది.
2021-22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చే పెద్ద సంస్కరణల భాగంగా, పార్లమెంటు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) సవరణ చట్టం, 2021ను ఆమోదించింది. ఈ సవరణ ద్వారా బీమా కంపెనీలలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటాను తప్పనిసరిగా ఉంచాలన్న నిబంధనను తొలగించారు. దీంతో ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులకు దారులు తెరుచుకున్నాయి.
ఇక బీమా రంగానికి మరింత పెట్టుబడులు రప్పించడానికి, ముఖ్యంగా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి, కేంద్రం FDI పరిమితిని 74 శాతం నుండి 100 శాతానికి పెంచే బిల్లును రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 1 నుండి 19 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 15 పని దినాలు ఉండగా.. ఈకొత్త బిల్లును అప్పుడే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు పెరిగితే భారత బీమా మార్కెట్‌లోకి గ్లోబల్ కంపెనీలు రావడానికి, నూతన సాంకేతికత ప్రవేశించడానికి, మరింత కవరేజీ విస్తరించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
ఏదేమైనా.. general insurance companies రంగం పెద్ద ఎత్తున మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. విలీనం, ప్రైవేటీకరణ, FDI పెంపు వంటి కీలక సంస్కరణలు అమలైతే భారత బీమా రంగం పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ దిశగా వేగంగా కదిలే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications