తెలంగాణలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డుకు చెందిన ఫ్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం వేయనున్నట్టు హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. అలాగే కొన్నిచోట్ల పూర్తయిన అపార్ట్‌మెంట్లు, మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న అపార్ట్‌మెంట్లను ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నవి ఉన్నట్లుగానే విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్-కమిటీ ఆమోదం తర్వాత, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు రెండూ కలిపి జూన్ 20న దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తాయని గౌతమ్ తెలిపారు.
కాగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకం, హౌసింగ్ బోర్డు కింద ఓపెన్ ప్లాట్లు, ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణశాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు సంబంధించి నిధుల సమీకరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 11 ప్రాంతాలలో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులలోని ఫ్లాట్‌లను వేలం కోసం గుర్తించింది. అలాగే నాలుగు ప్రాంతాలలో హౌసింగ్ బోర్డు కింద ఓపెన్ ప్లాట్‌లను కూడా గుర్తించింది. రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా..రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌లో 514 ఓపెన్ ప్లాట్లు, కుర్మల్‌గూడలో 20, చందానగర్‌లో మూడు ప్లాట్‌లను ప్రభుత్వం వేలం వేయనుంది.
అదనంగా, బండ్లగూడలో 159 పూర్తయిన ఫ్లాట్లు, పోచారంలో 601, గాజులరామారంలో ఐదు అసంపూర్తి నిర్మాణాలు, బహదూర్‌పల్లిలో ఆరు అసంపూర్తి నిర్మాణాలు, 69 ఓపెన్ ప్లాట్‌లను అమ్మకానికి ఉంచనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇతర భవనాలలో పోతులమడుగు గ్రామంలో 111 ఓపెన్ ప్లాట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అమిస్తాపూర్‌లో 45, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లిలో ఎనిమిది అసంపూర్తి భవనాలు, 3.38 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉన్నాయి.వీటిని కూడా వేలానికి తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం.
రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజులరామరం, పోచారం, పోలేపల్లిలలోని అసంపూర్తిగా ఉన్న టవర్ల కోసం, 100 నుండి 150 ఫ్లాట్‌లను కలిగి ఉన్న ప్రతి టవర్‌ను వేలం కోసం ఒకే యూనిట్‌గా పరిగణించాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది. వీటిని బిల్డర్లు, ఒక గ్రూప్‌గా ఏర్పడి కానీ, బహుళ అంతస్థుల భవనాల అవసరం ఉన్న సంస్థలు కానీ వీటిని తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు ఆస్తుల విషయానికొస్తే వేలంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఫేజ్-IVలో 7.33 ఎకరాల ఖాళీ భూమి, 4,598 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలు కలిగిన రెండు ఓపెన్ ప్లాట్‌లు ఉంటాయి. అదనపు ప్లాట్ల విషయానికి వస్తే.. నాంపల్లిలో 1,148 చదరపు గజాలు, SR నగర్‌లో 2,605 చదరపు గజాలు ఉన్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ORR, ఇతర ప్రాంతాల చుట్టూ ఉన్న వివిధ గృహనిర్మాణ పథకాల అభివృద్ధికి ఇవ్వడానికి ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications