IRCTCలో వాటా విక్రయానికి రెడీ, భారీగా పడిపోనున్న ప్రభుత్వం షేర్
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC)లో వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాటా విక్రయ ప్రక్రియను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్స్ నుండి బిడ్స్‌ని ఆహ్వానించింది ప్రభుత్వం. దీని ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీలోగా మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేయాలి.

75 శాతానికి వాటా తగ్గించుకోవాలి
IRCTCలో ప్రస్తుతం ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలో వాటాను ప్రభుత్వం 75 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కొంత వాటాను ఐపీవో ద్వారా కేంద్రం విక్రయించింది. దీని ద్వారా రూ.645 కోట్లను సమీకరించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆయిల్ కంపెనీల విక్రయం, ఎల్ఐసీ వాటాను ఐపీవో ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

నష్టపోయిన IRCTC షేర్
వాటా విక్రయం నేపథ్యంలో IRCTC షేర్లు నిన్న 1.05 శాతం మేర నష్టపోయి రూ.1,347.55 వద్ద క్లోజ్ అయింది. ఇండియన్ రైల్వేస్ 2019 అక్టోబర్ నుండి స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఉంది. ఐపీవో ద్వారా అప్పుడు కొంత సమీకరించింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.2.10 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.20 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.

కరోనా కారణంగా.. బ్రేక్
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇది ఈక్విటీ మార్కెట్ పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. దీంతో డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్(CPSE)లో వాటాలు విక్రయించలేకపోయింది.


Click it and Unblock the Notifications