Sovereign Gold Bonds: ప్రస్తుతం దేశంలో డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై ప్రజలకు ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రజల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 18 నుంచి 22 మధ్య కాలంలో మూడో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ విక్రయించాలని చూస్తోంది. అలాగే నాలుగో విడతను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 12-16 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వీటిని భారత ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది.

వివరాల్లోకి వెళితే 2023-24 సిరీస్ 3 సావరిన్ గోల్డ్ బాండ్స్ డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. అయితే వీటి కేటాయింపులు డిసెంబర్ 28, 2023న జరగనున్నాయి. పెట్టుబడిదారులు వీటిని దేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని దేశంలో నివశించే వ్యక్తులు, ట్రస్టులు, హిందు అన్ డివైడెడ్ ఫ్యామిలీ, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కొనుగోలు చేసేందుకు అర్హులు.
వ్యక్తులు గరిష్ఠంగా 4 కేజీలు, హిందు అన్ డివైడెడ్ ఫ్యామిలీ 4 కేజీలు, ట్రస్టులు గరిష్ఠంహా 20 కేజీల బంగారాన్ని సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించబడింది. అలాగే మెుత్తం పెట్టుబడి కాలం 8 ఏళ్లు ఉన్నప్పటికీ.. 5వ ఏడాది పూర్తైన తర్వాత పెట్టుబడిదారులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. అలాగే పెట్టుబడి కాలంలో ఇన్వెస్టర్లు 2.5 శాతం వడ్డీని సైతం పొందుతారు.
వాస్తవ రూపంలో బంగారం ఇవ్వరు కాబట్టి దీనికి ఒక అధికారిక సర్టిఫికెట్ అందించబడుతుంది. దీనిపై పొందే వడ్డీ ఆదాయం సైతం ఆదాయపు పన్ను కిందకు వస్తుంది. అయితే లాక్ ఇన్ పిరియడ్ తర్వాత విక్రయించటం ద్వారా పొందే మూలధన లాభాలపై పన్ను మినహాయింపును పెట్టుబడిదారులు పొందుతారు.


Click it and Unblock the Notifications