మూడేళ్ల క్రితం ఫ్లైట్ టిక్కెట్లపై కేంద్రం ఇప్పుడు ఆదేశాలు.. విమాన ప్రయాణీకుల కోసం కొత్త ఫ్రేమ్ వర్క్
కొవిడ్ సృష్టించిన విలయతాండవం కళ్లారా చూశాం. దీనికితోడు ఒక్కసారిగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో లక్షలాది ప్రయాణీకులు అప్పట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయంలో విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం ఇప్పటికీ ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన వ్యవహారానికి సంబంధించి కేంద్రం ఇప్పుడు స్పందించడం విశేషం.
మార్చి 25, 2020 అనంతరం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పలు విమాన సేవలు సైతం నిలిపివేయబడ్డాయి. అప్పుటి విమాన టిక్కెట్ బుకింగ్‌లకు సంబంధించిన రీఫండ్ లు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. వీటిని నవంబర్ 3వ వారంలోగా ప్రాసెస్ చేయాలని ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్‌లను ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించింది.

ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్‌లతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ప్రయాణీకుల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే సమస్యలపై చర్చించింది. ఇందులో కోవిడ్-19 లాక్‌డౌన్ వ్యవధిలో బుక్ చేసిన టిక్కెట్ల అమౌంట్ ను ఇప్పటికీ తిరిగి చెల్లించకపోవడం చర్చకు రావడంతో ప్రభుత్వం స్పందించింది.
'వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడం కోసం అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయడంపై ఆలోచనలు జరిపాం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా కలిసి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించాం' అని ప్రభుత్వం ప్రకటించింది. ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్ తో నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌ను అనుసంధానం చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications