కరోనా టైంలో మీ డబ్బు అవసరం: వొడాఫోన్ ఐడియాకు సుప్రీంకోర్టు, 11,000 ఉద్యోగులకు శాలరీ ఇవ్వలేం!
ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టులో గురువారం (జూన్ 18) విచారణ జరిగింది. ఈ బకాయిల్లో కొంతమొత్తాన్ని వెంటనే ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మీ నిధులు అవసరమని పేర్కొంది. వీటిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉందని తెలిపింది.

కరోనా టైంలో మీ డబ్బులు అవసరం
'మీరు కొంత మొత్తాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలి. ప్రస్తుతం ప్రజాప్రయోజనం కోసం ఈ డబ్బు ఎంతో ముఖ్యం. కరోనా సంక్షోభం నేపథ్యంలో వెంటనే ఈ డబ్బును డిపాజిట్ చేయాలి' అని సుప్రీం కోర్టు.. వొడాఫోన్ ఐడియాను ఆదేశించింది. వొడాఫోన్ ఐడియా తరఫున సీనియర్ అడ్వోకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

11,000 మందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి
డబ్బులు చెల్లిస్తే తమ వద్ద ఏమీ మిగలదని, అప్పుడు 11,000 మంది ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురవుతాయని, ప్రస్తుతం కంపెనీ పరిస్థితి బాగాలేదని, కొత్తగా బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే స్థితిలో కూడా లేదని వొడాఫోన్ ఐడియా తరఫు న్యాయవాది చెప్పారు. ఇప్పటికే కేంద్రం వద్ద రూ.15,000 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఉందని తెలిపింది. ప్రతి ఏడాది రూ.5000 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. తమ చెల్లింపుల కోసం ఇరవై ఏళ్లు సమయం ఇవ్వాలని కోరింది. ఏ బ్యాంకు కూడా తమ కంపెనీకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలిపింది. ఏజీఆర్ రుణాలు సహా లక్ష కోట్ల నష్టాలను చూపించి రుణాలు రావడం లేదని తెలిపింది.

20 ఏళ్లు సమయం ఇవ్వండి
తమకు చెల్లింపుల కోసం 20 సంవత్సరాల సమయం ఇవ్వాలని కోరుతూ కంపెనీ చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని డిపార్టుమెంట్ ఆప్ టెలికంను (DoT) అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications