కరోనాతో దేశం, ప్రపంచం అతలాకుతలమవుతోంది. కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ డ్రైవ్ కొనసాగుతోంది. వ్యాక్సీన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం తగ్గించేలా కరోనా వ్యాక్సీన్ పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సీన్ ధరలు తగ్గితే ఎక్కువమంది ప్రయివేటుగా వ్యాక్సీన్ వేయించుకోవడానికి ముందుకు వస్తారని భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వ్యాక్సీన్ తక్కువకే అందించేందుకు..
వ్యాక్సీన్ పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నును మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు నుండిన వారందరికీ కరోనా వ్యాక్సీన్ ఇస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ఒక డోసు పైన ప్రజలపై వందల రూపాయల వరకు భారం తగ్గుతుందని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వ్యాక్సీన్‌ను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రజలపై భారం ఒక డోస్ రూ.1200 దిగువకు వస్తుందని అంచనా. ఇప్పటికే కొవిడ్ వ్యాక్సీన్ కోసం వివిధ ప్రయోజనాలు కల్పించింది కేంద్రం. కరోనా వ్యాక్సీన్‌కు అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై దిగుమతి సుంకం మాఫీ చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 వ్యాక్సీన్ల పైన 5 శాతం జీఎస్టీని మాఫీ చేసే ఆలోచన చేస్తోంది.

వ్యాక్సీన్ ధరలు
వ్యాక్సీన్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, ప్రయివేటు కేంద్రాలు నేరుగా వ్యాక్సీన్ తయారీదారుల నుండి సేకరించవచ్చు. తయారీదారులు తమ ఉత్పత్తిలో 50 శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు తమ వ్యాక్సీన్ ధరలను అధికారికంగా ప్రకటించాయి. కొవిషీల్డ్ వ్యాక్సీన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి డోసుకు రూ.400, ప్రయివేటు ఆసుపత్రులకు రూ.600 చొప్పున విక్రయిస్తామని సీరం ప్రకటించింది. కొవాగ్జిన్ ధర రాష్ట్రాలకు రూ.600, ప్రైయివేటులో రూ.1200గా ఉంటుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ధరలపై విమర్శలు రావడంతో సీరం ధరలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వానికి డోసుకు రూ.300 విక్రయిస్తామని తెలిపింది.

రిజిస్ట్రేషన్
కరోనా వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమైంది. మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాలకు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు కోటిన్నరకు పైగా రిజిస్ట్రర్ చేసుకున్నారు. టీకా తీసుకోవాలనుకునే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేవలం మొదటి రోజు 1.33 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications