శానిటైజర్, మాస్కుల ధర భారీగా పెంపు, రంగంలోకి దిగిన కేంద్రం: ధరలపై పరిమితి
కరోనా వైరస్ కారణంగా హ్యాండ్ శానిటైజర్లు, మాస్కుల ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. డీలర్స్, దుకాణదారులు ఈ మహమ్మారిని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో మాస్కుల ధర పది రెట్లకు పైగా కూడా ఉంటోంది. శానిటైజర్ వేయికి పైగా కూడా పలుకుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు రంగంలోకి దిగింది.

శానిటైజర్, మాస్క్‌ల గరిష్ట ధర..
చేతులు శుభ్రం చేసుకునేందుకు వినియోగించే శానిటైజర్, మాస్కుల ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. 200 మిల్లీ లీటర్ల శానిటైజర్ ద్రావణం ధర రూ.100కు పరిమితం చేసింది. రెండు పొరల సర్జికల్ మాస్క్ గరిష్ట ధర రూ.8గా చేసింది. మూడు పొరల సర్జికల్ మాస్క్ గరిష్ట ధర రూ.10గా నిర్ణయించింది.

30వ తేదీ వరకు ఇదే ధర
ఈ ధరలు జూన్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ శనివారం ప్రకటన చేశారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం టూ లేయర్, త్రీ లేయర్ మాస్కుల ధరలు వరుసగా రూ.8, రూ.10 ఉంటాయని పాశ్వాన్ పేర్కొన్నారు.

ముడిసరుకుల ధరలను పరిగణలోకి తీసుకున్నాకే..
అత్యవసరమైన ఈ పరిస్థితుల్లో ధరలు భారీగా పెంచుతున్నందున ధరలపై పరిమితి విధిస్తున్నట్లు పాశ్వాన్ పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు, శానిటైజర్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ పరిమితి విధించినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే 13వేల మందికి పైగా మృతి చెందారు. 3 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కోలుకున్న వారు మాత్రం కేవలం లక్షమంది మాత్రమే ఉన్నారు.


Click it and Unblock the Notifications