బంగారం, వెండి వ్యాపారులకు బిగ్ షాక్.. వాటిపై కేంద్రం కొత్త రేట్లు ప్రకటన..
Drawback Rates on Gold and Silver: భారతీయ ఆభరణాల ఎగుమతిదారులకు లభించే పన్ను ఊరటపై కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. బంగారం, వెండి ఆభరణాల ఎగుమతిదారులకు వర్తించే డ్యూటీ డ్రాబ్యాక్ (Duty Drawback) రేట్లను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ నూతన పన్ను రీఫండ్ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో విదేశాలకు పసిడి, వెండి వస్తువులను ఎగుమతి చేసే వ్యాపారులకు లభించే రీఫండ్ ప్రయోజనాలు తగ్గనున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన మూడు ప్రధాన టారిఫ్ వర్గాలలో ఈ కోత విధించారు. బంగారు ఆభరణాల ఎగుమతిపై అందించే డ్యూటీ డ్రాబ్యాక్ రీఫండ్ను గ్రాముకు గతంలో ఉన్న రూ. 1,851.99 నుండి రూ.1,794.11కి తగ్గించారు. ఇది సుమారు 3.1 శాతం తగ్గింపుకు సమానం. ఇక వెండి ఆభరణాలు, కొన్ని వెండి ఉత్పత్తులపై ఇచ్చే డ్యూటీ డ్రాబ్యాక్ రేటును కిలోగ్రాముకు రూ. 29,501.09 నుండి ఏకంగా రూ.26,859.02 కి కుదించారు. ఇది దాదాపు 9 శాతం మేర భారీ తగ్గింపును సూచిస్తుంది.

గత జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై డ్యూటీ డ్రాబ్యాక్ను గ్రాముకు రూ. 773.17 నుండి రూ. 1,851.99కి, వెండిపై కిలోకు రూ. 14,990.66 నుండి రూ. 29,501.09కి గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే, మారిన విపణి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఆ రేట్లలో మళ్లీ కోత విధించారు.
డ్యూటీ డ్రాబ్యాక్ అంటే ఏమిటి? ఎందుకు తగ్గించారు?
ఎగుమతి కోసం తయారు చేసే ఆభరణాల కోసం ఉపయోగించే దిగుమతి చేసుకున్న ముడి బంగారం లేదా వెండిపై ఎగుమతిదారులు చెల్లించిన కస్టమ్స్ డ్యూటీ, ఇతర ఛార్జీలను ప్రభుత్వం తిరిగి చెల్లించడాన్నే డ్యూటీ డ్రాబ్యాక్ అంటారు. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఎగుమతిదారుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, వారి పోటీతత్వాన్ని నిలబెట్టడం దీని ప్రధాన ఉద్దేశం.
ఈ తగ్గింపుపై ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) కార్యదర్శి సురేంద్ర మెహతా స్పందిస్తూ.. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొంత తగ్గడం వల్ల వీటిపై నమోదయ్యే ప్రభావవంతమైన దిగుమతి సుంకం విలువ కూడా తగ్గిందని తెలిపారు. డ్యూటీ డ్రాబ్యాక్ రేట్లు శాతాల రూపంలో కాకుండా నిర్దిష్ట స్థిర మొత్తాలుగా (Fixed Amount) ఉంటాయి కాబట్టి, ముడి సరుకుల విలువ తగ్గడంతో ఈ రేట్లను సాంకేతికంగా సవరించడం అనివార్యమైందని ఆయన వివరించారు.
డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ల తగ్గింపు వల్ల సాధారణ ప్రయాణికులు లేదా దేశీయంగా బంగారం కొనుగోలు చేసే వినియోగదారులపై ఎలాంటి ప్రభావం నేరుగా పడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం విదేశాలకు ఆభరణాలను ఎగుమతి చేసే వ్యాపారుల రీఫండ్లకే పరిమితమవుతుంది. దీనివల్ల ఎగుమతిదారుల లాభాల మార్జిన్లపై కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ప్రధానంగా అంతర్జాతీయ పసిడి ధరలు, రూపాయి-డాలర్ మారకపు విలువ, ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు మరియు స్థానిక పండుగల డిమాండ్పై మాత్రమే ఆధారపడి ఉంటాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications
