వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండుతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇతర PSU బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మెపై హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని బ్యాంకు యూనియన్ల సమ్మె కారణంగా బ్యాంకు కార్యకలాపాలు ప్రభావితమవుతాయని తమ కస్టమర్లకు తెలియజేశాయి.

వేతన సవరణకు డిమాండ్
తక్షణ వేతన సవరణను డిమాండ్ చేస్తూ తొమ్మిది బ్యాంకు యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వివిధ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్ (NOBW) వంటి యూనియన్లు ఉన్నాయి.

పురోగతి లేనందునే..
సమస్య పరిష్కార కోసం చీఫ్ లేబర్ కమిషనర్ ఎదుట జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదని, దీంతో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కి తీసుకోవడం లేదని AIBOC ప్రెసిడెంట్ సునీల్ కుమార్ తెలిపారు. తమ డిమాండ్ల నుంచి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) నుంచి కూడా ఎలాంటి హామీ రాలేదని AIBEA జనరల్ సెక్రటరీ వెంకటాచలం తెలిపారు.

రెండేళ్లుగా పెండింగులో..
పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ అంశం 2017 నవంబర్ నుంచి పెండింగులో ఉంది. తమ డిమాండ్లపై సానుకూల ప్రకటన రాకుంటే సమ్మెకే వెళ్తామని వెంకటాచలం తెలిపారు. వేతన సవరణపై IBA స్పందించడం లేదని, దీంతో తమకు సమ్మె మినహా మరో ఆప్షన్ లేకుండా పోయిందని, సమ్మె కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని, తమతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఫిబ్రవరి 1న కూడా సమ్మె ఉండనుంది. కాగా యూనియన్లు 20 శాతం హైక్‌తో వేతన సవరణ కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications