Unwanted calls: ఏదైనా ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నప్పుడు ఓ ఫోన్ మోగుతుంది. క్రెడిట్ కార్డ్ ఇస్తాం, లోన్ రెడీగా ఉంది, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అంటూ అవసరం లేకపోయినా అంటగట్టాలని చూస్తుంటారు. వద్దని వారించినా ఓ పట్టాన వదలని వారూ ఉన్నారు. అయితే ఈ తరహా ఇబ్బందులకు ఇక ఫుల్ స్టాప్ పడనుంది.
వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా వస్తున్న ఇబ్బందికరమైన/ప్రమోషనల్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకుగాను మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇందులో సెల్యూలర్ పరిశ్రమ ప్రతినిధులతో పాటు టెలీకమ్యూనికేషన్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్స్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, RBI, IRDAI, TRAIలు సభ్యులుగా ఉంటాయని పేర్కొంది.

ట్రాయ్ మరియు సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAIలు టెలిమార్కెటింగ్ కంపెనీలతో కలిసి గైడ్‌లైన్స్ ముసాయిదాను రూపొందించాయి. ఇబ్బందికరమైన ప్రమోషనల్ వాణిజ్య కాల్స్‌కు సంబంధించి చర్చించేందుకు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్పామ్ కాలర్లు ఇప్పుడు ఇంటర్నెట్ కాల్స్‌కు మారుతున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. పోంజీ స్కీమ్‌లు, క్రిప్టో పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేస్తూ మోసాలకు పాల్పడేందుకు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారని వెలుగుచూసింది. రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల నుండి స్పామ్ మెసేజ్‌లు, ఇబ్బందికరమైన కాల్స్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి DoT మరియు TRAI ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. త్వరలోనే ఈ సమస్యకు శుభం కార్డు పడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications