Hybrid ATM: చిల్లర కష్టాలకు చెక్.. ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!
ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య 'చిల్లర'. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (RBI) కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాయి. అదే 'హైబ్రిడ్ ఏటీఎం' (Hybrid ATM).

మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఇప్పటికీ చిన్న చిన్న అవసరాలకు నగదు (Cash) ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, బస్సు ప్రయాణాలు, చిన్నపాటి చిరుతిళ్ల దగ్గర రూ. 500 నోటు ఇస్తే 'చిల్లర లేదు' అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సరికొత్త హైబ్రిడ్ (Hybrid ATM)లను ప్రవేశపెడుతోంది. ఈ మిషన్లు కేవలం డబ్బులు డ్రా చేయడానికే కాదు, మీ దగ్గర ఉన్న పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
హైబ్రిడ్ ఏటీఎంల ప్రత్యేకత ఏంటి?
సాధారణ ఏటీఎంలు ఎక్కువగా రూ. 500, రూ.200 వంటి నోట్లనే స్టాక్ చేస్తాయి. కానీ, ఈ కొత్త హైబ్రిడ్ మిషన్లు (Hybrid ATM) రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను డిస్పెన్స్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. వీటిలో ప్రధానంగా రెండు ఫీచర్లు ఉంటాయి:
- మైక్రో విత్‌డ్రాల్స్: రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తంలో నగదును తీసుకోవచ్చు.
- నోట్ ఎక్స్‌ఛేంజ్: మీ వద్ద ఉన్న రూ. 500 నోటును మిషన్‌లో ఉంచితే అది వెంటనే మీకు అవసరమైన చిన్న నోట్లను అందిస్తుంది.
మొదటి అడుగు ముంబైలో.. తర్వాత దేశవ్యాప్తంగా!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇప్పటికే ముంబైలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రద్దీగా ఉండే మార్కెట్లను దీని కోసం ఎంపిక చేశారు. ముంబైలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ఆర్బీఐ (RBI) లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ 60% పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నందున ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.
RBI ముందున్న సవాళ్లు ఏంటి?
ఈ వ్యవస్థను అమలు చేయడం అంత సులభం కాదని RBI విశ్లేషిస్తోంది. చిన్న నోట్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటంతో పాటు అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులు తమ ఏటీఎంలలోని సాఫ్ట్‌వేర్, 'క్యాసెట్స్' (నోట్లు ఉంచే ట్రేలు) మార్చాల్సి ఉంటుంది. పదే పదే డబ్బులు నింపాల్సి రావడం వల్ల నిర్వహణ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్థిక సమ్మిళితం (Financial Inclusion) లో భాగంగా సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ అడుగు వేస్తోంది.
డిజిటల్ ఇండియా వైపు మనం వేగంగా వెళ్తున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్యుడికి నగదు అవసరాలు ఇంకా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ లేని వారు కూడా సులభంగా లావాదేవీలు జరుపుకోవడానికి ఈ హైబ్రిడ్ ఏటీఎం (Hybrid ATM) లు ఒక వరంలా మారనున్నాయి. ఈ మిషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఆటో డ్రైవర్లతోనో లేదా చిరు వ్యాపారులతోనో చిల్లర కోసం గొడవ పడే రోజులు ముగిసిపోతాయి.


Click it and Unblock the Notifications