New Power Tariffs: కొత్త పవర్ బిల్లింగ్ రూల్స్.. రాత్రి పూట కరెంట్ వాడితే బిల్లు పేలిపోద్ది..!!
New Power Tariffs: దేశంలో కొత్త విద్యుత్ వినియోగం, బిల్లింగ్ విషయంలో పెద్ద మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న పద్ధతులను ప్రభుత్వం మారుస్తోంది.
రానున్న కాలంలో పగటిపూట 20 శాతం వరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి, ఇదే సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే రద్దీ సమయాల్లో 20 శాతం వరకు పెంచడానికి అనుమతించే కొత్త విద్యుత్ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది. అంటే పగటి పూట విద్యుత్ వినియోగం చౌకగా మారనుండగా.. రాత్రి వినియోగం ఖరీదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు, రద్దీ లేని సమయాల్లో కరెంట్ వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని దేశంలో అమలులోకి తీసుకొస్తోంది. దీనివల్ల పీక్ లోడ్ తగ్గటంతో పాడు గ్రిడ్ స్థిరత్వం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 2024 నుంచి వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వర్తించనున్నాయి. అలాగే ఏడాది తర్వాత వ్యవసాయ రంగంలోని వినియోగదారులకు మినహా.. ఇతర వినియోదారులందరికీ అమలవుతాయని రాయటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
రాత్రిపూట ఎక్కువ సమయం ఏసీలు వినియోగించేవారు పెద్ద మెుత్తం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శిలాజ ఇంధనంతో విద్యుత్ తయారు చేసే ప్లాంట్లపై భారాన్ని తగ్గించడం, రాత్రిపూట విద్యుత్తు అంతరాయాలను తగ్గించడం దీని లక్ష్యంగా తెలుస్తోంది. ఎండల వేడి కారణంగా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరతను చవిచూసింది. సరఫరా డిమాండ్ ను అందుకోలేక పోయింది.
సౌర విద్యుత్తు చౌకైనందున ఆ సమయంలో సుంకం తక్కువగా ఉంటుందని, తద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోలార్ లేని సమయాల్లో థర్మల్, హైడ్రో పవర్ అలాగే గ్యాస్ వినియోగించి చేసే విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కరెంట్ వాడితే టారిఫ్‌పై ప్రభావం పడుతుందని అన్నారు. అయితే రాత్రిపూట ఎక్కువ శక్తిని వినియోగించే వినియోగదారులు, ఎయిర్ కండీషనర్లను నడుపుతున్న వారు తమ బిల్లులు పెరగడాన్ని చూడవచ్చని తెలుస్తోంది.



Click it and Unblock the Notifications