కరోనా మహమ్మారి సమయంలో కొన్ని దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నాయి. షట్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులకు అండగా ఉండేందుకు ఫేస్‌బుక్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు బోనస్ ఇచ్చాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన ఉద్యోగులకు 1000 డాలర్లు (దాదాపు రూ.75,000) భత్యంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే వివిధ సంస్థలు ఇంటి నుండి పని చేసేలా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయాలను నడిపేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.

వెయ్యి డాలర్లు ఇస్తున్నాం..
ఇందులో భాగంగా గూగుల్ తమ ఉద్యోగులకు వెయ్యి డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటి నుండి పని చేసే ఉద్యోగులకు అవసరమైన ల్యాప్‌టాప్, ఇతర హార్డ్‌వేర్ పరికరాల కొనుగోలు నిమిత్తం దీనిని అందిస్తున్నట్లు గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. మరికొన్ని నెలలు కూడా గూగుల్ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తారనే అంచనాలతో ప్రతి ఉద్యోగికి ఈ వెయ్యి డాలర్లు ఇవ్వాలనుకున్నామని, ఇంటి నుండి పని చేసేందుకు వీలుగా ఆఫీస్ అవసరాల కోసం ఆ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పిచాయ్ ఉద్యోగులకు లేఖ రాశారు.

వెయ్యి డాలర్లు
ఇంటి నుండి పని చేసేందుకు ఉపయోగపడే పరికరాల కోసం దీనిని ఇవ్వడం ద్వారాఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులకు మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కంపెనీ తమ కోసం ఉందనే భరోసాను కల్పిస్తున్నట్లు తెలిపారు. వెయ్యి డాలర్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ఉద్యోగులకు ఇవ్వనున్నారు. ప్రతి గూగుల్ ఉద్యోగికి వెయ్యి డాలర్లు లేదా దీనికి సమానమైన వారి వారి దేశ కరెన్సీని అందిస్తామని చెప్పారు. అంటే ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు రూ.75,000. ఈ క్యాలెండర్ ఇయర్‌లో కార్యాలయాలకు తక్కువ మంది వచ్చినా పర్వాలేదని అభిప్రాయపడ్డారు.

క్రమంగా కార్యాలయాలు ఓపెన్
జూలై 6వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆఫీస్‌లు 10 శాతం ఉద్యోగులతో తెరుస్తామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి 30 శాతం ఉద్యోగులు ఉండేలా చూసుకుంటామన్నారు. అయితే ఆయా నగరాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటామని సుందర్ పిచాయ్ చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ, పరిమిత సంఖ్యలో రొటేషన్ పద్ధతిలో ఉద్యోగులు హాజరయ్యేలా చూస్తామన్నారు.


Click it and Unblock the Notifications