IT News: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పలు దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తమ మనుగడ కొనసాగేందుకు ఖర్చులు తగ్గించుకోవడం మినహా మరో మార్గం లేదని ఆయా దిగ్గజ కంపెనీలు భావించాయి. దీంతో ఉద్యోగుల తొలగింపు, కొలువుల్లో కోతలు విధించాయి. చిన్నా, చితకా సంస్థలైతే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ గూగుల్, ఫేస్ బుక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు సైతం తలవంచక తప్పలేదు.
ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే అత్యుత్తమ కార్యాలయంగా గూగుల్ కు భారీ రేటింగ్ ఉంది. తమ సిబ్బందికి అందించే ప్రోత్సాహకాల గురించి అయితే చెప్పాల్సిన పనిలేని స్థాయిలో ఉంటాయి. అయితే ఈ అలవెన్సులు కంపెనీకి ఖరీదైనవిగా మారినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ఇందువల్ల అదనపు ఖర్చులను తగ్గించుకోవాలని టెక్ దిగ్గజం యోచిస్తున్నట్లు వెల్లడించింది.

ఉచిత స్నాక్స్, లాండ్రీ సేవలు, కంపెనీ లంచ్ లతో సహా సంస్థ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న కొన్ని ప్రోత్సాహకాలను తగ్గించాలని గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ కార్యాలయాల్లోని మైక్రో కిచెన్‌లను మూసివేయనున్నట్లు ఉద్యోగులకు CFO రూత్ పోరాట్ ఓ మెమో పంపించారు. ఆఫీస్ లొకేషన్, అవసరాలు, ట్రెండ్ ల ఆధారంగా పెర్క్స్ లో సర్దుబాట్లు జరుగుతాయని అందులో తెలిపారు.
ఖర్చుల తగ్గింపులో భాగంగా ల్యాప్ టాప్ ల వంటి వ్యక్తిగత పరికరాలపై వెచ్చించడాన్ని నిలిపివేయాలని గూగుల్ భావిస్తోంది. దీనికితోడు నిధులు ఆదా చేయడానికిగాను నియామక ప్రక్రియను సైతం నెమ్మదిస్తోంది. అయితే పరిశ్రమలో అగ్రగామి సౌకర్యాలు, ప్రయోజనాలను కొనసాగిస్తూనే.. వనరుల మెరుగైన వియోగం కోసం కొన్ని మార్పులు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications