రూ. 22 వేల కోట్లు ఇస్తేనే గూగుల్ విశాఖకు వచ్చింది..కర్ణాటక మంత్రి సెటైర్.. కూటమి స్పందన ఏంటంటే..
Andhra vs Karnataka: ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ (Google) తన భారీ పెట్టుబడిని బెంగళూరులో (Bengaluru) కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam) లో పెట్టాలని నిర్ణయించడంతో రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన రాజకీయ వేడి చెలరేగింది. దాదాపు 15 బిలియన్ డాలర్ల విలువైన మెగా డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ ప్రాజెక్టు గూగుల్ ద్వారా విశాఖకు రావడం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పెట్టుబడిని సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కర్ణాటకలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీశాయి.
కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు) ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌కు భారీగా రూ. 22 వేల కోట్ల విలువైన సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, యుటిలిటీ రాయితీలు ఇచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని NDTV కథనం తెలిపింది. ఈ కథనంప్రకారం, ఈ ఉచితాలు పెట్టుబడిని ఆకర్షించడానికి ఉపయోగించబడ్డాయని ఇది రాష్ట్రాల మధ్య అన్యాయానికి దారి తీస్తుందని విమర్శలు గుప్పించారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన కర్ణాటక ప్రభుత్వాన్ని అసమర్థమైన పాలన (Inefficient governance) అని అభివర్ణిస్తూ, తమ రాష్ట్రంపై ఇలాంటి విమర్శలు చేయడం న్యాయసమ్మతం కాదని అన్నారు.వారు (కర్ణాటక ప్రభుత్వం) తమ మౌలిక సదుపాయాలను సరిదిద్దుకోవాలి. విద్యుత్ కోతలు, రహదారి సమస్యలు, పారిశ్రామిక విధానంలో లోపాలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెళ్లిపోతారు. మేము సమర్థవంతమైన పాలన చూపిస్తున్నాము కాబట్టి పెట్టుబడులు మన దగ్గరికి వస్తున్నాయని లోకేష్ తెలిపారు.
ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఆయన సరదాగా సెటైర్ వేస్తూ.. వైజాగ్‌లో G అంటే ఇకపై గూగుల్ (Google) అని అర్థం చేసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. గూగుల్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ చూపుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం టెక్నాలజీ కేంద్రంగా ఎదగాలని తాను ఎప్పటి నుంచో కృషి చేస్తున్నానని అన్నారు.
అయితే కర్ణాటక వైపు నుండి మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. అక్కడి పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ అనుసంధాన వ్యవస్థలలో స్తబ్దత, విద్యుత్ సరఫరా లోపాలు, అధిక భూమి ధరలు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాంకేతిక రంగంలో ముందడుగు వేసిందని చెబుతున్నారు.
ఆంధ్రాలో గూగుల్ ప్రాజెక్ట్ అమలయితే దాదాపు 60 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. టెక్నాలజీ హబ్‌లుగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు తరువాత, విశాఖపట్నం కూడా భారత టెక్ మ్యాప్‌లో ప్రముఖ స్థానం పొందే అవకాశం ఉంది. గూగుల్ రాకతో దక్షిణ రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోరు (Investment race) కొత్త దశలోకి వెళ్ళిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications