Sundar Pichaiకి గూగుల్ ఉద్యోగుల లేఖ.. తొలగింపుల నేపథ్యంలో 5 డిమాండ్లు..!
Google News: ప్రపంచ టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్ సైతం తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోబోలకు సైతం లేఆఫ్ ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ఖం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో గూగుల్ ఉద్యోగులు సీఈవో సుందర్ పిచాయ్ కి ఒక బహిరంగ లేఖ రాయటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం చివరికి బ్యాంకులను సైతం కుదిపేస్తోంది. లక్షల మంది ఉపాధిని కోల్పోతున్నారు. ఈ క్రమంలో 1400 మంది గూగుల్ ఉద్యోగులు కొన్ని డిమాండ్లతో సీఈవోకు ఒక లేఖ రాశారు. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో కొత్త నియామకాలను నిలిపివేయాలని వారు కోరారు. తప్పని పరిస్థితుల్లో తొలగింపులు చేయాల్సి వస్తే కొన్ని అవకాశాలను వెసులుబాట్లను అందించాలని ఉద్యోగులు కోరారు.

తిరిగి నియామకాలు చేపట్టే క్రమంలో ఇటీవల ఉద్యోగాలను కోల్పోయిన ఆల్ఫాబెట్(గూగుల్ మాతృ సంస్థ) ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యం అందించాలని సీఈవోను కోరారు. దీనికి తోడు అంతర్గత బదిలీలు, ఇంటర్వ్యూలు లేకుండా పాత ఉద్యోగులకు జాబ్ ఆఫర్ అందించాలని కోరారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధ సంక్షోభ ప్రాంతాలకు చెందిన తోటి ఉద్యోగులను తొలగించవద్దని వారు యాజమాన్యానికి విన్నవించారు. అలా చేయటం వల్ల వారు వీసా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. సంక్షోభంలో ఉన్న ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు అదనపు సహాయాన్ని కంపెనీ అందించాలన్నారు.
మెటర్నిటీ, బేబీ బాండింగ్ వంటి సెలవుల్లో ఉన్న వారిని అర్థాంతరంగా తొలగించవద్దని.. వారికి షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన సెలవులను పూర్తి చేసుకునేంత వరకు ఉద్యోగులుగా కొనసాగించాలని సీఈవోకు రాసిన లేఖలో వెల్లడించారు. లింగ, జాతి, కుల, వయస్సు, మతం, వైకల్యాలు వంటి వాటి ఆధారంగా వివక్షలు లేకుండా ఉద్యోగుల పట్ల వ్యవహరించాలని ఉద్యోగులు తమ లేఖలో సుందర్ పిచాయ్ ని కోరారు. ప్రస్తుతం ఈ లేఖ ప్రపంచ వ్యాప్తంగా తొలగింపులకు గురవుతున్న అనేక మంది తమ యాజమాన్యాలతో చెప్పలనుకుంటున్న అనేక విషయాలను కలిగి ఉండటంతో భారీ చర్చకు దారితీసింది.


Click it and Unblock the Notifications