కరోనా మహమ్మారి నేపథ్యంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ కారణంగా ఐటీ కంపెనీలతో పాటు వివిధ రంగాల్లో అవకాశం కలిగిన కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులతో ఇంటి నుండి పని చేయిస్తున్నాయి. తాజాగా, గూగుల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను దాదాపు ఏడాది పాటు పొడిగించింది.

గూగుల్ కీలక నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి అరవై డెబ్బై లక్షల మందికి పైగా కరోనా సోకింది. ఇందులో ఆరున్నర లక్షలమంది చనిపోయారు. కోటి మందికి పైగా రికవరీ అయ్యారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, కంపెనీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఉద్యోగులు కూడా కార్యాలయానికి రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గూగుల్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వచ్చే ఏడాది (2021) జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

2 లక్షలమందికి ఊరట
ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్ పంపారు. ఉద్యోగులు ఆఫీస్‌లకు వచ్చే అవసరం లేకుండా ఇంటి నుండి పని చేసే వెసులుబాటును వచ్చే జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. గూగుల్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్స్‌కు ఉపశమనం లభిస్తుంది.

పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు
గూగుల్ నిర్ణయం ఇతర కంపెనీలపై ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే పలు కంపెనీలు కార్యాలయాలు తెరిచాయి. దశలవారీగా ఉద్యోగులను రప్పిస్తూ కార్యకలాపాలు ఆఫీస్ నుండి ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పెద్ద టెక్ కంపెనీలు, ఉద్యోగులు తీసుకునే జాగ్రత్తలకు ఇది నిదర్శనం అంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్ తమ ఉద్యోగులను ఇంటి నుండి వర్క్ చేసేందుకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ లోపు కార్యాలయాలు తెరిచేది లేదని ట్విట్టర్ గతంలో ప్రకటించింది.


Click it and Unblock the Notifications