‘Vibe Coding' తో.. కోడింగ్ ఆటగా మారింది! సుందర్ పిచాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! అసలేంటీ వైబ్ కోడింగ్?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) నేడు శరవేగంతో విస్తరిస్తూ.. పరిశ్రమలు, విద్య, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లో ప్రవేశించింది. ఏకంగా ఇది మన రోజువారీ జీవితాన్ని కూడా సమూలంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ కోడింగ్ పక్కకు పోయి అధునాతన ప్రోగ్రామింగ్ విధానం అయిన 'వైబ్ కోడింగ్' (Vibe Coding) అందుబాటులోకి వచ్చిందని గురించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలేంటీ వైబ్ కోడింగ్.. ఇప్పుడు తెలుసుకుందాం

గూగుల్ ఫర్ డెవలపర్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కృత్రిమ మేధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) అన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ నేపథ్యం లేని వ్యక్తులు కూడా ఇప్పుడు తమ ఆలోచనలను కేవలం వివరించడం ద్వారా AI -ఆధారిత టూల్స్ సహాయంతో యాప్‌లను రూపొందిస్తున్నారని తెలిపారు. దీనితో యాప్ డెవలప్‌మెంట్ ప్రక్రియ చాలా ఈజీగా, సరళంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాలలో కొత్త యుగం: వైబ్ కోడింగ్
ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనివారు, AIలో ఎటువంటి నైపుణ్యం లేనివారు కూడా AI- టూల్స్ ను ఉపయోగించి నిమిషాల్లో యాప్ నమూనాలను తయారుచేయగలిగే స్థాయికి సాంకేతికత మారిందని పిచాయ్ వివరించారు. ఇంటర్నెట్ మొదలైన రోజుల్లో రచయితలు బ్లాగింగ్‌ను తమ వృత్తిగా ఎలా మార్చుకోగలిగారో అలాగే ఇప్పుడు వైబ్ కోడింగ్ కూడా కొత్త ఉపాధి మార్గాలను, సృజనాత్మక అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త విధానం సరదాగా, సులభంగా ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలను, ముఖ్యంగా భద్రత విషయంలో ప్రమాదాలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
గుర్తుంచుకోవాల్సిన విషయం
వైబ్ కోడింగ్ సరదాగా ఉన్నప్పటికీ ఈ విధానం ఇంకా సంక్లిష్టమైన లేదా అత్యంత సున్నితమైన సాఫ్ట్‌వేర్ నిర్మాణానికి సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. " ఇటువంటి టూల్స్ ద్వారా రూపొందించబడిన కోడ్‌లో మన సమాచారానికి లేదా డేటాకు భద్రత ఉంటుందని హామీ ఇవ్వడం కష్టం. అందువల్ల డేటా సేఫ్టీ అవసరమయ్యే కీలక రంగాలలో మానవ నిపుణుల ప్రమేయం తప్పనిసరి" అని ఆయన అన్నారు. అలాగే మున్ముందు వచ్చే రోజుల్లో ఈ టెక్నాలజీలు మరింత పరివర్తన చెందుతాయని, వాటిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏమి సృష్టిస్తారోనని తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పిచాయ్ తెలిపారు.
వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?
వైబ్ కోడింగ్ (Vibe Coding) అనేది అధునాతన ప్రోగ్రామింగ్ విధానం. ఇది సాంప్రదాయ పద్ధతుల మాదిరిగా సంక్లిష్ట ప్రోగ్రామింగ్ భాషలపై ఆధారపడదు. కోడింగ్ రానివాళ్లు కూడా చేయగలిగే కోడింగ్ ఇది.
- రెగ్యులర్ లాంగ్వేజ్ : ఇది సాధారణ ఇంగ్లిష్.. అలాగే AI అసిస్టెడ్ టూల్స్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
- ప్రాంప్ట్ బేస్డ్ : యూజర్ తమకేం కావాలో వివరంగా, సరళంగా వివరించగలిగితే చాలు.
- AI టూల్స్: AI టూల్స్ ఈ సాధారణ వివరణలను ఫంక్షనల్ కోడ్ ప్రాంప్ట్‌ల రూపంలోకి మారుస్తాయి.
- ఆటోమేషన్: ఈ సహాయంతో ఎవరైనా లోతైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే యాప్‌లను సృష్టించుకోవచ్చు. రోజువారీ పనులను ఆటోమేట్ చేయవచ్చు లేదా వెబ్‌సైట్లను రూపొందించుకోవచ్చు.


Click it and Unblock the Notifications