Google News: పలు సంస్థలు మెయిల్ సర్వీసెస్‌ను ఉచితంగా అందిస్తున్నా.. టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. సమయానుగుణ అప్‌డేట్స్, సులభమైన ఇంటర్‌ఫేస్.. దాన్ని ఆ స్థానంలో నిలబెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన యూజర్స్‌కు జీమెయిల్ తాజాగా ఓ హెచ్చరిక జారీచేసింది.
గూగుల్ తన జీమెయిల్ సర్వీసెస్‌ను ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కనీసం రెండేళ్లుగా వాడుకలోలేని మెయిల్స్, ఫొటోలు, గూగుల్ డ్రైవ్ ఖాతాలను డిలీట్ చేయనుంది. దీంతో లక్షలాది ఖాతాలు శాశ్వతంగా తొలగించబడే ప్రమాదం ఉంది. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది.

'మా ఉత్పత్తులకు సంబంధించి రెండేళ్ల పాటు వినియోగంలోలేని గూగుల్ ఖాతాలను ఇనాక్టివ్ చేస్తున్నాము' అని గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ మేలో ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించారు. ఈ విధానం డిసెంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఆ పని మొదలుపెట్టింది.
ఫిషింగ్ స్కామ్‌లు, అకౌంట్ హ్యాకింగ్ వంటి భద్రతా సమస్యల నుంచి క్రియాశీల గూగుల్ వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అకౌంట్స్ తొలగింపునకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు యూజర్లకు నోటిఫికేషన్స్ పంపినట్లు పేర్కొంది. వాటి అనుబంధ ఖాతాలకు సైతం మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు చెప్పింది.
తమ ఖాతా తొలగింపబడకుండా యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ నుంచి ఏదైనా మెయిల్ పంపించడం, డ్రైవ్ మరియు ప్లే స్టోర్ నుంచి డేటా డౌన్‌లోడ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలను ఈ ప్రక్రియలో గుర్తించడం లేదని వెల్లడించింది.


Click it and Unblock the Notifications