Income Tax: 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు శుభవార్త..!
Tax Payers: గడచిన కొంత కాలంగా దేశీయ పన్ను చెల్లింపు, లెక్కింపు పద్ధతుల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్రమాలను అరికట్టడంలో నూతన సాంకేతికతను పన్ను అధికారులు విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి ఊరటనిచ్చే పెద్ద వార్త ఇప్పడు ఒకటి ఉంది.
దేశంలోని 80 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. వాస్తవానికి ఆదాయపు పన్ను శాఖ దాదాపు 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులపై పెండింగ్‌లో ఉన్న మైనర్ ట్యాక్స్ డిమాండ్‌లను తొలగిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) చైర్మన్ నితిన్ గుప్తా శుక్రవారం దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. తాము ఈ పన్ను డిమాండ్లను తొలగించనున్నట్లు చెబుతూ.. పన్ను శాఖ రికార్డుల నుంచి సదరు డిమాండ్లను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.

పన్ను డిమాండ్ల తొలగింపుకు టాక్స్ పేయర్స్ ఏమీ చేయనవసరం లేదని చెబుతూనే.. వారిని పన్ను అధికారులు కూడా సంప్రదించబోరని సీబీడీటీ చీఫ్ గుప్తా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పన్ను చెల్లింపుదారులకు ప్రతికూలంగా ఉండదని అన్నారు. అయితే ఈ డిమాండ్లు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఉంచబడతాయని, తద్వారా వారు కూడా చూడవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ఈ డిమాండ్‌లకు సంబంధించి సరిదిద్దడం లేదా రీఫండ్ కేసు పెండింగ్‌లో ఉన్నట్లయితే, దానిని జాగ్రత్తగా చూసుకుంటామని ఆయన చెప్పారు. దాదాపు 80 లక్షల మందికి చెందిన రూ.3,500 కోట్లు దీనికింద పరిష్కరించబడనున్నాయి.
గురువారం పార్లమెంటులో సమర్పించిన మధ్యంతరబడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.25,000 వరకు పన్ను డిమాండ్లను ఉపసంహరించుకోవాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.25,000 వరకు పన్ను వివాదాలను ఉపసంహరించుకోవడం గురించి, 2010-11 ఆర్థిక సంవత్సరానికి 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.10,000 వరకు ప్రత్యక్ష పన్ను డిమాండ్ల గురించి గుప్తా మాట్లాడారు.


Click it and Unblock the Notifications