సినిమా నచ్చలేదా? మధ్యలో థియేటర్ వదిలి వెళ్లిపోతే రికెట్ డబ్బు రిటర్న్.. పూర్తి వివరాలు..
PVR Inox Billing: దేశంలో ఓటీటీ కల్చర్ విస్తరించటంతో సినిమాలను హాళ్లకు వెళ్లి వీక్షించేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. దీంతో కొన్ని చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోకే అరంగేట్రం చేస్తూ మూవీ లవర్స్ కి దగ్గరవుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద సినిమాలు లేదా నచ్చిన హీరో సినిమాల కోసం, హిట్ టాక్ వచ్చిన మూవీస్ చూసేందుకు మాత్రమే ప్రజలు థియేటర్లకు వెళ్లటం సర్వ సాధారణంగా మారిపోయింది.
సినిమాలు చూడటానికి టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండటం కూడా చాలా మందిని థియేటర్లకు వెళ్లకుండా చేస్తోందనే వాదనలు కూడా ప్రస్తుతం ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలను సినిమా హాళ్లకు రప్పించేందుకు నిర్వహకులు కొత్త ఆఫర్లతో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. నెలకు మూవీ పాస్ పేరుతో గతంలో ఆఫర్లను అందించిన పీవీఆర్ తాజాగా మరో కొత్త బిల్లింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది. అన్ని సినిమాలు వీక్షకులను చివరి వరకూ కూర్చోబెట్టలేవు. కొందరు సినిమాను నచ్చిన వరకు చూసిన తర్వాత కొంత భాగాన్ని చూడకుండానే హాలు నుంచి వెళ్లిపోతుంటారు. అయితే ఇలాంటి వారు అనవసరంగా సినిమాకు డబ్బు ఖర్చుచేశాం అనే ఫీలింగ్ కలగకుండా చేయాలని పీవీఆర్ ప్రయత్నాలు చేస్తోంది.

కంపెనీ తాజాగా కొత్త బిల్లింగ్ విధానాన్ని తీసుకొచ్చే పనిలో ఉందని తెలుస్తోంది. ఫ్లెక్సీ షో పేరుతో థియేటర్లలో 'పే ఫర్ వాట్ యు వాచ్ మోడల్'తో రావాలని కంపెనీ చూస్తోంది. దీనికింద వీక్షకులు సినిమా చూసిన సమయానికి మాత్రమే డబ్బు చెల్లించటానికి వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పైగా వారు సినిమాను వదిలి ఏ సమయంలోనైనా హాలు నుంచి బయటకు వచ్చే స్వేచ్ఛను ప్రేక్షకులకు కల్పిస్తుంది. ఈ సౌకర్యం వల్ల వీక్షకులు తాము సినిమా చూసేందుకు గడిపిన సమయానికి మాత్రమే టిక్కెట్ ధర వసూలు చేయబడనుందని తెలుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా, వారు అందించే ఉత్పత్తుల రకంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సీఈవో రెనాడ్ పల్లియర్, PVR ఐనాక్స్ పేర్కొనటం గమనార్హం.
అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇంకా పైలట్ దశలోనే ఉన్నట్లు సమాచారం. ముందుగా దీనిని దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కొన్ని షోలకు అలాగే గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన సినిమాల్లో అందుబాటులో ఉంచబడిందని తెలుస్తోంది. అయితే కొత్త విధానం కింద ఫ్లెక్సీ షో ఫీచర్‌ను ఎంచుకోవాలనుకునే ప్రేక్షకులు కోసం టిక్కెట్ ధరపై అదనంగా 10 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పల్లియర్ వెల్లడించారు. నిర్దిష్ట స్క్రీన్‌లోని వ్యక్తులు AI కెమెరా ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ట్రాక్ చేయబడతారని దాని ద్వారానే వారి రీఫండ్ ప్రాసెసింగ్ చేయబడుతుందని తెలుస్తోంది. దీని ప్రకారం సగం సినిమా చూసి వెళ్లిపోతే సగం టిక్కెట్ డబ్బు తిరిగి చెల్లించబడుతుందని, సినిమా 50 శాతానికి మించి ఉంటే 60 శాతం, సినిమాలో 25 నుంచి 50 శాతం మిగిలిపోతే టికెట్ ధరలో 30 శాతం వరకు కొత్త ఫ్లెక్సీ ప్లాన్ కింద తిరిగి వెనక్కి ఇవ్వబడుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications