Infosys News: టెక్కీలకు శుభవార్త.. ఇన్ఫోసిస్ శాలరీ హైక్స్, ఎంత పెంచిందంటే..?
Infosys Salary Hike: దేశంలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే ట్రైనీలను తొలగించటంతో ఇటీవల ఆగ్రహానికి గురైన కంపెనీ ప్రస్తుతం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పటానికి సిద్ధంగా ఉంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపులకు సంబంధించిన ఇంక్రిమెంట్ లెటర్లను ఫిబ్రవరి చివరి నాటికి విడుదల చేయనున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు సగటున 5 శాతం నుంచి 8 శాతం వరకు వేతన పెంపును అందించనున్నట్లు విషయం తెలిసి వ్యక్తులు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ప్రకటించిన వేతన పెంపులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తోంది. విడతల వారీగా కంపెనీ తన ఉద్యోగులకు హైక్ లెటర్స్ అందిస్తోంది. వివిధ బృందాలకు డిసెంబరు మాసంలో వేతన పెంపులకు సంబంధించిన వివరాలను కంపెనీ మెయిల్ ద్వారా ఇప్పటికే పంపింది.

వాస్తవానికి గడచిన కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం క్రమంగా తొలగిపోవటంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలో క్లయింట్లు ఖర్చు చేసేందుకు కొత్త బడ్జెట్స్ అలాట్ చేయటం డిమాండ్ వాతావరణాన్ని మెరుగుపడుస్తోంది. చాలా భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరులు ఉత్తర అమెరికా నుంచే వస్తున్నాయి. అయితే అక్కడి కంపెనీలు తమ టెక్ స్పెండింగ్ పెంచటం కొత్త ప్రాజెక్టుల రూపంలో ఇండియన్ ఐటీ కంపెనీలకు ఊపిరిపోస్తోంది.
కంపెనీ కొత్త ఏడాది రెండవ విడత వేతన పెంపులను ఏప్రిల్ మాసంలో ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. వీరి వేతనాలను పెర్ఫామెన్స్ ఆదారంగా పెంచబడతాయని తెలుస్తోంది. వాస్తవానికి ఇన్ఫోసిస్ చివరిగా తన ఉద్యోగుల వేతనాలను నవంబర్ 2023లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మందగమనంతో వ్యాపార డిమాండ్ నెమ్మదించిన వేళ కంపెనీ ఉద్యోగులకు వేతన పెంపులను ఆలస్యం చేసింది. టీసీఎస్ మినహా అనేక టెక్ కంపెనీలు తమ శాలరీ హైక్స్ తర్వాతి త్రైమాసికాలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మైసూర్ క్యాంపస్ ట్రైనీల తొలగింపు..
మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 400 మంది ఫ్రెషర్లను లేఆఫ్ చేయటం, వారిని వెంటనే వెకేట్ చేయాలని చెప్పటం కోటి కలలతో వచ్చిన టెక్ ఫ్రెషర్లకు పీడకలను మిగిల్చింది. కంపెనీ నిర్ణయంతో హటాత్తుగా ట్రైనీలు క్యాంపస్ ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024 నుంచి కంపెనీ అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయటం వల్లనే తాము ఫెయిల్ అయినట్లు ట్రైనీలు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీలో ట్రైనింగ్ పొందుతున్న దాదాపు 4500 ఫ్రెషర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications