AP Liquor: ఏపీలో నేటి నుంచి వైన్స్ బంద్..! వాయిదా నిజమేనా..??
AP Liquor Policy: ఏపీలో వినాయకచవితి రోజు నుంటి అంటే సెప్టెంబర్ 7 నుంచి మందుషాపులు క్లోజ్ అయ్యాయి. ఒకపక్క సీఎం చంద్రబాబు విజయవాడ వరదలను దగ్గరుండి సమీక్షిస్తున్న వేళ లిక్కర్ పాలసీపై ఉద్యోగుల ఆందోళన సంగతి కొంత మరుగునపడింది. అధికార యంత్రాంగం దీంతో సమస్య పరిష్కారంపై చర్యలు ఆలస్యం అయ్యేటట్లు కనిపిస్తున్నాయి.
వరదలతో అతలాకుతలమైన ఏపీని తిరిగి గాడినపెట్టేందుకు చర్యల్లో తలమునకలైన కూటమి ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ ఉద్యోగులు పెద్ద తలనొప్పిగా మారారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వైన్ షాపు ఉద్యోగులు నేటి నుంచి నిరసనకు సిద్ధమయ్యారు. కొత్తగా ఏర్పాడిన ప్రభుత్వ లిక్కర్ పాలసీ తమ ఉపాధిని దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు స్వయంగా తమకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఈ సమస్య ఉత్పన్నం కావటానికి ప్రధాన కారణంగా గత వైకాపా ప్రభుత్వం లిక్కర్ ఆదాయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి వచ్చే విధంగా స్వయంగా షాపులను నిర్వహించింది. ఇందుకోసం అప్పట్లో వేల సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను సైతం నియమించుకుంది. ప్రస్తుతం ఈ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం తెస్తున్న లిక్కర్ వ్యాపార ప్రైవేటీకరణను నిరసిస్తూ తమ సమస్యను పరిష్కరించాలని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ క్రమంలో సేల్స్ మెన్లు, సూపర్ వైజర్లు తమ సమస్యను సీఎం దృష్టికి లేఖ ద్వారా ఇప్పటికే వెల్లడించారు. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే సీఎం చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం ఏపీలో భారీగా వర్షాలు, వరదలు, వినాయక చవితి పండుగ ఉండటంతో బంద్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తెలిపిందని తెలుస్తోంది. అయితే దీనిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవేళ పాత లిక్కర్ విధానానికి మారితే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications