Petrol Prices: తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు.. ఫైనల్ అప్రూవల్ కోసం వెయిటింగ్..!
Petrol-Diesel Rates: ఎప్పటి నుంచో భారతదేశంలో చమురు ధరలతో సంబంధం లేకుండా పెట్రోల్-డీజిల్ రేట్లు అధికంగానే కొనసాగుతున్నాయి. గతంలో కేంద్రం రేట్లు తగ్గించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వినియోగదారులకు పాస్ చేయలేదు.
దేశంలో చమురు ధరల తగ్గింపుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఇంధన ధరల్లో గణనీయమైన ఉపశమనం 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ద్రవ్యోల్బణంపై ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎదుర్కోవడానికి అధికార బీజేపీ వ్యూహాత్మక చర్యగా చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో తగ్గింపులకు సంబంధించి కేంద్ర ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పలు ఎంపికలపై చర్చించి ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.4 నుంచి రూ.10 వరకు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. గడచిన మూడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 70-80 డాలర్ల శ్రేణిలో కొనసాగుతున్నాయి. ధరలు గతంలో కంటే తగ్గినప్పటికీ దేశంలో ప్రజలకు దానిని పాస్ చేయకపోవటంతో ప్రస్తుతం ఎన్నికలకు ముందు ఆ పని చేసే పనిలో మోదీ సర్కార్ ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తక్కువ క్రూడ్ ధరల కారణంగా గణనీయమైన లాభాలను ఇటీవలి త్రైమాసికాల్లో నమోదు చేశాయి. గతంలో నష్టాలను సైతం కంపెనీలు పూడ్చుకోవటంతో ప్రస్తుతం తగ్గిన అంతర్జాతీయ క్రూడ్ ప్రయోజనాలను ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని నిపుణులు చెబుతున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో అధిక ముడి చమురు ధరల కారణంగా ఆయిల్ రిఫైనింగ్ కంపెనీల నష్టానికి మద్దతు ఇవ్వడానికి యూనియన్ బడ్జెట్ రూ.30,000 కోట్లను ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌గా కేటాయించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల కారణంగా ఈ మద్దతు అవసరం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications