ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువతకు శుభవార్త, కంపెనీలు జనవరి నుండి మార్చి వరకు బంపర్ రిక్రూట్‌మెంట్లు చేస్తాయి
కరోనా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాల కోత, టెక్ కంపెనీల లే ఆఫ్స్ ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చేశాయి. ఈ కాలంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు కూడా. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాలు ఉన్నప్పటికీ ఆశించినంతగా లేదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం నిరుద్యోగులకు అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు బంపర్ న్యూస్. ఏంటంటే రానున్న నెలల్లో కొత్త ఉద్యోగాలు పెరగనున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు బంపర్ రిక్రూట్‌మెంట్‌కు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వేలో పేర్కొన్న 40 శాతం కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్ రాబోయే మూడు నెలల్లో వారి ఉద్యోగులను పెంచుతుందని తెలిపింది. మరోవైపు జనవరి-మార్చి 2025లో భారతదేశంలో ఉపాధి రంగం ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉండే అవకాశం ఉంది. అంటే కొత్త ఉద్యోగాలు సృష్టించి యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
సర్వేలో 3,000 కంపెనీలు
భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన 3వేల కంటే ఎక్కువ కంపెనీలు ఈ సర్వేలో చేర్చారు. మంగళవారం విడుదల చేసిన సర్వే ప్రకారం, 53 శాతం మ్యానేజ్మెంట్లు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నాయి, అయితే 13 శాతం యజమాన్యాలు 2025 క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించవచ్చని భయపడుతున్నాయి. అదే సమయంలో 31 శాతం కంపెనీలు ఎటువంటి మార్పును ఆశించడం లేదు. మొత్తం మీద రాబోయే రోజుల్లో కాలం కలిసొస్తుందని పూర్తి ఆశగా ఉంది. అంతేకాదు ప్రభుత్వం తన వ్యయాన్ని కూడా పెంచుతోంది, దింతో కంపెనీల నుండి వర్క్ ఆర్డర్‌లను పెంచుతుంది. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.

ప్రపంచంలో అత్యధిక అవకాశాలు
మ్యాన్‌పవర్‌గ్రూప్‌లోని ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటీ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్‌లో గ్లోబల్ లీడర్‌గా దాని స్థానం దేశ ఆర్థిక పురోగతిపై యజమానుల విశ్వాసాన్ని చూపిస్తుంది. భారతదేశంలో అత్యధిక నెట్ ఉపాధి అంచనా శాతం 40 శాతం ఉంది. దీని తర్వాత అమెరికా 34 శాతం, మెక్సికో 32 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అర్జెంటీనా ఉపాధి మాత్రం చాలా అధ్వాన్నంగా ఉంది అంటే -1 శాతం. కాగా ప్రపంచ సగటు 25 శాతంగా అంచనా వేశారు. అయితే ఆశించినంతగా ఈ ఉద్యోగ నియామకాలు ఉంటాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications