టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..జీతాల పెంపుపై సీఎఫ్‌వో కీలక ప్రకటన
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. కంపెనీ సీఎఫ్ఓ సమీర్ సెక్సారియా మీడియాతో మాట్లాడుతూ..తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు మా మొదటి ప్రాధాన్య అంశమని తెలిపారు. కాగా టీసీఎస్ మూడు రోజుల క్రితం కంపెనీ తొలి త్రైమాసికి ఫలితాలను ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే జీతాల పెంపుపై ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. తాజాగా దీనిపై సీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ సీఎఫ్ఓ ఏమన్నారంటే మా మొదటి ప్రాధాన్యత ఇప్పుడు ఉద్యోగుల జీతాల పెంపుదల పైనే ఉంది. అయితే పెంపు ఎప్పటి నుండి అమలవుతుందని మాత్రం ఖచ్చితంగా వెల్లడించలేము కాని పెంచడం మాత్రం పక్కా అని తెలిపారు. వేతనాల ఆలస్యం ఇంతకుముందెప్పుడూ జరగలేదని ఈ సారి కొంచెం ఆలస్యమైందని తెలిపారు. వేతనాల పెంపుదల వల్ల కంపెనీ లాభాల మార్జిన్ దాదాపు 1.50 శాతం తగ్గే అవకాశం ఉందని సెక్సారియా అన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ 24.5 శాతంకి తగ్గింది, అయితే టార్గెట్ మాత్రం 26-28 శాతంగా ఉంచింది.

కంపెనీ CHRO మిలింద్ లక్కడ్ గతం వారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల వేతనాల పెంపుదలపై కంపెనీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కంపెనీ సాధారణంగా ప్రతి ఏప్రిల్ 1 ఉద్యోగులకు జీతాల పెంపుదలను అందిస్తుంది. అయితే ఈ సారి మాత్రం ఆలస్యం అయింది. ఈ క్వార్టర్లీలో ఉద్యోగుల తొలగింపు రేటు 13.8 శాతంకి చేరింది.. ఇది గత త్రైమాసికంలో 13.3 శాతంగా ఉంది. ఇది స్వల్పమైన పెరుగుదల అయినప్పటికీ కంపెనీ కొత్త ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సెక్సారియా తెలిపారు. ఇక TCS ప్రస్తుతం కొత్త ఉద్యోగ నియామకాలను తగ్గించనున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో అవసరానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు మళ్లీ ప్రారంభించవచ్చని సూచించింది.
FY26 తొలి త్రైమాసికంలో TCS ఏకీకృత నికర లాభం 6% పెరిగి రూ. 12,760 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.12,040 కోట్లుగా ఉంది. ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.63,437 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు జియోపాలిటికల్ అడ్డంకులు ఆదాయ పెరుగుదలపై ప్రభావం చూపినట్లు టీసీఎస్ కంపెనీ పేర్కొంది.పెట్టుబడుల విషయంలో.. కంపెనీ వెనక్కు తగ్గబోదని స్పష్టంగా తెలిపింది.
TCS భవిష్యత్తులో లాభదాయకతతో కూడిన వృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతోందని సెక్సారియా స్పష్టం చేశారు. వృద్ధి లేకుండా లాభాలు వచ్చినా అవి ఉపయోగపడవన్నారు. కొనుగోలు చేయాలంటే కంపెనీ టాప్ లైన్ మెరుగుపరచడానికోసం కాదు.. మార్కెట్‌లో సరైన అవకాశాల కోసం మాత్రమే చేస్తామని వివరించారు. కంపెనీ జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 0.20 శాతం క్షీణించి 24.5 శాతంగా నమోదైందని, అయితే మార్జిన్లను 26-28 శాతానికి తీసుకురావడమే తమ ఉద్దేశమని సెక్సారియా తెలిపారు. కాగా జూలై 11 నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.81 లక్షల కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications