Content Creators: ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకోవటంతో ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ చూడగలుగుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సహా అనేక ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ సృష్టించడాన్ని లక్షలాది మంది యువత ఇప్పుడు తమ కెరీర్‌గా మార్చుకుంటున్న సంగతి తెలిసిందే.
మార్కెట్లోని అనేక వ్యాపార సంస్థలు లేదా బ్రాండ్లకు సైతం వారు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను సపోర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రపంచ ఆడియో-విజువల్ అండ్ వినోద సమ్మిట్ (WAVES) 2025 సందర్భంగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధిని ప్రకటించారు. ఈ నిధి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద పని చేస్తుందని తెలుస్తోంది. కంటెంట్ క్రియేటర్లకు ఇది ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది వారి కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా అందించడానికి వీలు కల్పిస్తుందని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.
దీనితో పాటు రూ.391 కోట్ల వ్యయంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని స్థాపించాలని నిర్ణయించబడింది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఐఐటీ, ఐఐఎం తరహాలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక్కడ కంటెంట్ క్రియేషన్ అండ్ డిజిటల్ మీడియాకు సంబంధించిన ఉన్నత స్థాయి శిక్షణ అందించబడుతుంది. ప్రస్తుతం దేశంలో కంటెండ్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 30 బిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడుతోంది. వాస్తవానికి ఇది మెుత్తం దేశ జీడీపీలో 2.5 శాతానికి సమానమైనదిగా తెలుస్తోంది.

ఇదే క్రమంలో దేశంలో ఇన్ ఫ్లుయన్సర్ల వ్యవస్థ కూడా వేగంగా అభివృద్ధ చెందుతోందని తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. దీని విలువ దాదాపు రూ.3375 కోట్లుగా ఉంది. దేశంలో 12 శాతం కంటెంట్ క్రియేటర్లు నెలకు రూ.లక్ష నుండి రూ.10 లక్షల మధ్య సంపాదిస్తున్నారని వెల్లడైంది. అలాగే 90 శాతం మంది రానున్న రెండేళ్లలో తమ ఆదాయం మరింతగా పెరుగుతోందని భావించటం గమనార్హం.
ప్రభుత్వం వేవ్స్ బజార్ అనే ప్రపంచవ్యాప్త ఇ-మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. ఈ మార్కెట్‌ప్లేస్ భారతీయ తయారీదారులను అంతర్జాతీయ మార్కెట్‌లతో అనుసంధానిస్తుంది. ఈ వేదిక సినిమా, టీవీ, గేమింగ్, సంగీతం, యానిమేషన్, ఇ-స్పోర్ట్స్ వంటి రంగాలలో కంటెంట్ సృష్టికర్తలకు ప్రపంచవ్యాప్త అవకాశాలను అందిస్తుందని తెలుస్తోంది. అయితే మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను ఆర్గనైజ్డ్ సిస్టమ్ కిందకు తీసుకురావాలని చూస్తున్నట్లు ప్రస్తుత సమయంలో చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications