హైదరాబాద్: భాగ్యనగరవాసులకు శుభవార్త. మెట్రో రైళ్లో ప్రయాణించేవారు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందవచ్చు! జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి తీసుకు వచ్చింది. మొబైల్ డేటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పిస్తోంది. మెట్రోలో షుగర్ బాక్స్ నెట్ వర్క్‌ను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. షుగర్ బాక్స్ నెట్ వర్క్‌తో ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది.
మొదట పది మెట్రో స్టేషన్లలో షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వైఫై సేవలు ప్రారంభించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలో మరిన్ని రైల్వే స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఈ యాప్‌తో మూడు నిమిషాల్లోనే ఓ సినిమాను డౌన్ లోడ్ చేసుకోవచ్చునన్నారు. మెట్రో స్టేషన్లో ప్రయాణీకులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

అలాగే మెట్రో రైళ్లలో వినోదం, మేధో సంపత్తిని పెంచే పుస్తకాలు ఉంచాలని కోరినట్లు తెలిపారు. రెండో దశ మెట్రో డీపీఆర్ సిద్ధమైందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జనవరి నెలాఖరు సమయానికి జేబీఎస్ - ఎంజీబీఎస్ పనులు పూర్తవుతాయన్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో 70వేల మంది ప్రయాణీకులు ఎక్కువగా మెట్రోను ఉపయోగించారన్నారు. 14 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు విక్రయించామన్నారు.
ఇదిలా ఉండగా, G5 సేవలు రెండు నెలల పాటు ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు షుగర్ బాక్స్ సీఈవో రోహిత్ తెలిపారు. ఆ తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరం. గేమింగ్, ఫుడ్, ఈ-కామర్స్, ఈ-లర్నింగ్ వంటివి కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది హైదరాబాద్ మెట్రో.
ప్రయాణీకులు తమ మొబైల్ డేటా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మెట్రో రైలులో ఉన్న ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందవచ్చు. అయితే ఇది 60 రోజుల వరకు మాత్రమే. ఆ తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తారు. తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీతో పాటు వివిధ సంస్థలకు షుగర్ బ్లాక్ నెట్ వర్క్ సేవలు అందిస్తోంది.


Click it and Unblock the Notifications