బంగారు రోజులే, అవి ఎంతో ప్రయోజనం: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రధానంగా విమానయానం, హాస్పిటాలిటీ, హోటల్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే మున్ముందు భారత ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు (గోల్డెన్ ఇయర్స్) ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. దేశంలో మున్ముందు వృద్ధి రేటును చూసి ప్రజలు ఆశ్యర్యపోతారన్నారు. లౌకికత్వం, నిర్మాణాత్మక చర్యల వల్ల స్టాక్ మార్కెట్ వేగం పుంజుకుంటుందని జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొంటున్నారని, స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయని తాను భావించడం లేదన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ తగ్గుముఖం పట్టిందని, మరణాలు తగ్గుతున్నాయని, ప్రజలు దీంతో కలిసి జాగ్రత్తగా జీవించడం నేర్చుకుంటున్నారని ఆయన ఈటీ-నౌ ఇంటర్వ్యూలో అన్నారు.

కరోనా కేసులు కాదు..
మున్ముందు భారత్ ప్రపంచ రైతు, కర్మాగారంగా కాగలదని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా స్టాక్స్ పైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారని, అలాగే, టాటా గ్రూప్ స్టాక్స్ రీ-ేటింగ్ ఉండవచ్చునన్నారు. వివిధ రంగాల్లో ఊహించిన దాని కంటే వేగంగా కరోనా నుండి కోలుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు కరోనా కేసుల పెరుగుదలపై దృష్టి సారించడం లేదన్నారు. అలాగే, కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయన్నారు. ప్రస్తుతం మంచి రిటర్న్స్ కోసం చూస్తున్నారన్నారు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థలో మంచి వృద్ధిని చూస్తామని, ఈ వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతారన్నారు.

ఈ స్టాక్స్ అదుర్స్
కరోనా కారణంగా రెస్టారెంట్, హాస్పిటాలిటీ రంగాలపై ఎక్కువ ప్రభావం పడిందని, ఇవి క్రమంగా కోలుకుంటాయని రాకేష్ చెప్పారు. ప్రపంచ ఫార్మా రాజధానిగా ఇండియా వెలుగొందుతుందన్నారు. ఇక నుండి ఫార్మా మరింత ర్యాలీ సాధిస్తుందన్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలోను ఎఫ్ఎంసీజీ కంపెనీలు ర్యాలీ సాధించాయన్నారు. భారత ఐటీ కంపెనీల్లోకి నగదు ప్రవాహం వస్తోందని, మంచి వృద్ధి కొనుగోలుదారులను ఆకర్షిస్తోందన్నారు. ఐటీ కంపెనీల్లోకి నగదు ప్రవాహం దాదాపు లాభాలకు సమానం అన్నారు.

వ్యవసాయ సంస్కరణలు రైతులకు ప్రయోజనం
టాటా సన్స్‌లోని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌లోని వాటాలను టాటాలు కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు రాబోయే రోజుల్లో వినియోగదారులకు, రైతులకు ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ఈ రంగంలో వ్యర్థాలు తగ్గుతాయన్నారు. భారత అతిపెద్ద విలువ ఆధారిత ఎగుమతుల్లో వ్యవసాయం ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications