Pakistan News: పాకిస్తాన్‌కు దొరికిన అక్షయపాత్ర.. ఈ దెబ్బతో పొరుగు దేశం ఫేట్ మారిపోతుందా..?
Pakistan economy: ప్రపంచ దేశాలు ఆర్థిక వృద్ధి రేస్‌లో ఓ పక్కన పరుగెడుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ టెర్రరిజంను పెంచి పోషిస్తూ మారణకాండకు కారణమవుతోంది. ఇటీవల దేశం దివాళా అంచుకు వెళ్లినా సరే తన పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. దీంతో వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం పుట్టే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. ఇలా ఎటూ పాలుపోని దీనస్థితిలో ఉన్న పాక్‌కు.. అక్షయ పాత్ర దొరికినట్లు నివేదికలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో గణనీయమైన పెట్రోలియం మరియు సహజ వాయువు నిక్షేపాలు కనుగొనడ్డాయి. ఇవి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన మిత్రదేశం సహకారంతో మూడేళ్లపాటు సర్వే జరిపిన అనంతరం ఈ విషయం ధృవీకరించబడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తలరాతను మార్చే సత్తా దీని సొంతమని సీనియర్ భద్రతా అధికారి తెలిపినట్లు డాన్ న్యూస్ పేర్కొంది.

విస్తృతమైన భౌగోళిక సర్వే అనంతరం ఆయిల్ డిపాజిట్ల ప్రదేశాన్ని గుర్తించిన సంబంధిత శాఖలు ప్రభుత్వానికి ఈ సమాచారం అందించాయి. చమురు మరియు గ్యాస్ మాత్రమే కాకుండా సముద్రం నుంచి ఇతర విలువైన ఖనిజాలను కూడా కలిగి ఉన్నట్లు వివరించాయి. ఈ 'బ్లూ వాటర్ ఎకానమీ' నుంచి ప్రయోజనం పొందేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
చమురు అన్వేషణ మరియు వెలికితీత కోసం బిడ్డింగ్ పనులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. కానీ వాస్తవంగా కార్యరూపం దాల్చేందుకు చాలా సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తున్నారు. దీనికి మరిన్ని పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం కానుంది. సర్వే ఫలితం ఆశాజనకంగా ఉన్నప్పటికీ అంచనా మేరకు నిల్వలు ఉంటాయని గ్యారెంటీ లేదని, దీనికోసం 5 బిలియన్ డాలర్ల అవసరం కాగా 5 ఏళ్ల సమయం పడుతుందని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (ఓగ్రా) మాజీ సభ్యులు ముహమ్మద్ ఆరిఫ్ తెలిపారు.


Click it and Unblock the Notifications