బంగారం ధరలు తగ్గాయని సంబరపడకండి.. ముందుంది ముసళ్ల పండగ అంటున్న అజయ్ కేడియా ..
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కొన్ని రోజులు వరుసగా పెరిగిన ధరలు, ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు, పెట్టుబడిదారుల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు Gold ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు.. పసిడికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలంలో Gold ధరలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్ దృష్టి అమెరికా ఆర్థిక గణాంకాలు, ఫెడ్ విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాలపైనే కేంద్రీకృతమై ఉంది.
ఈ నేపథ్యంలోనే కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా రాబోయే కొద్ది నెలల్లో వివిధ కమోడిటీల (బంగారం, వెండి, ముడి చమురు, పారిశ్రామిక లోహాలు) మార్కెట్ సరళిపై తన అంచనాలను వెల్లడించారు. అమెరికా ద్రవ్య సడలింపు అంచనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, యూఎస్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గడం వంటి సానుకూల అంశాలు బంగారం ధరలకు బలమైన మద్దతునిస్తాయని ఆయన పేర్కొన్నారు.

స్వల్పకాలిక దిద్దుబాటు (Correction) తర్వాత బంగారం ధరలు తిరిగి పుంజుకుంటాయని, ఒకవేళ ధరలు ఔన్సుకు 4,100 నుండి 4,120 డాలర్ల శ్రేణికి తగ్గితే అది పెట్టుబడిదారులకు మంచి కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఔన్సుకు 4,200 డాలర్ల వద్ద కొంత ప్రతిఘటన (Resistance) ఎదురైనప్పటికీ.. బంగారం సానుకూల దృక్పథంతోనే ట్రేడ్ అవుతూ తిరిగి ఔన్సుకు 4,250 డాలర్ల వైపు దూసుకువెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు.
బంగారంతో పోలిస్తే వెండి మరింత మెరుగైన పనితీరును కనబరచగలదని కేడియా విశ్లేషించారు. బంగారం-వెండి నిష్పత్తి ఇటీవలి గరిష్ట స్థాయిల నుండి వెనక్కి తగ్గడం, అలాగే పరిశ్రమల నుండి డిమాండ్ మెరుగుపడుతుండటంతో వెండి ధరలు జూలై నెలలో ప్రారంభంలో ఔన్సుకు 64 డాలర్లను పరీక్షించి, ఆపై ఔన్సుకు 68 డాలర్ల మార్కుకు చేరే అవకాశం ఉందన్నారు. పెట్టుబడిదారులు తదుపరి మార్కెట్ దిశ కోసం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన సంకేతాలు.. డాలర్ సూచిక, ప్రపంచ తయారీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
పారిశ్రామిక (బేస్) లోహాలలో కూడా జూలై నెలలో మంచి బలం కనిపిస్తుందని, ముఖ్యంగా జింక్, రాగి (Copper) ఈ నెలలో అల్యూమినియంను అధిగమించవచ్చని కేడియా అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా జింక్ మిగులు తగ్గడం, సాంకేతిక సూచికలు మెరుగుపడటంతో బేస్ మెటల్స్‌లో జింక్ తన ప్రాధాన్య ఎంపికగా నిలిచిందని, ఇది కిలోగ్రాముకు రూ. 390- రూ.395 స్థాయిని చేరవచ్చని పేర్కొన్నారు. చిలీ దేశంలో గనుల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 12.9% తగ్గడం, ప్రపంచ తయారీ రంగాలు స్థిరంగా ఉండటం రాగి ధరకు కలిసి వస్తుందని.. దేశీయంగా రాగి ధరలు కిలోగ్రాముకు రూ. 1,320 లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. అయితే, సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో అల్యూమినియం ధరలు మాత్రం ఒక పరిమిత శ్రేణిలోనే ఉండే అవకాశం ఉందన్నారు.
ముడి చమురు (Crude Oil) విషయానికి వస్తే.. మార్కెట్ ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని కేడియా స్పష్టం చేశారు. ఒపెక్ (OPEC) దేశాల నుండి ఉత్పత్తి పెరుగుతుండటం, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బలహీనంగా ఉండటం వల్ల ముడి చమురు ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. డిమాండ్ కంటే సరఫరా అధికంగా ఉన్నందున, జూలై నెలలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 70 డాల్ల నుండి 76 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ అయినప్పటికీ.. రాబోయే త్రైమాసికాలలో ఇది క్రమంగా తగ్గుతూ బ్యారెల్‌కు 60 నుండి 65 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు. రష్యా-ఉక్రెయిన్ పరిణామాల వంటి కొత్త భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఏర్పడి సరఫరాకు అంతరాయం కలిగిస్తే తప్ప.. ముడి చమురుపై ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగుతుందని కేడియా వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
